టీఆర్‌ఎస్, బీజేపీలది రహస్య మైత్రి 

4 Apr, 2019 03:18 IST|Sakshi

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే  

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రస్తుతం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రహస్య మైత్రి ఉం దని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ విషయంలో కేసీఆర్, బీజేపీ ప్రభుత్వానికి బహిరంగంగానే మద్దతు పలికిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన నల్లగొండలో టీడీపీ, తెలంగాణ జనసమితి పార్టీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ల కాలంలో ప్రతి విషయంలోనూ కేసీఆర్‌ బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు పలికారన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వ్యక్తిని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే.. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన మీరా కుమార్‌ను అభ్యర్థిగా పెట్టిన సందర్భంలో తాను స్వయంగా ఫోన్‌ చేసి సహకరించాలని కేసీఆర్‌ను కోరానని తెలిపారు. అయినా కేసీఆర్‌ బీజేపీకే మద్దతు ఇచ్చారని ఉత్తమ్‌ అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థికి సహకరించాలని కేసీఆర్‌ను కోరినా బీజేపీకే మద్దతు ఇచ్చారని తెలిపారు. బీజేపీ సీఎంలను మించి కేసీఆర్‌ పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ విషయంలో మోదీకి మద్దతు తెలిపారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని, ఆ ఓటు వృథా అవుతుందని పేర్కొన్నారు.   

నల్లగొండలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ 
నల్లగొండ: నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు భారీ స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక లక్ష్మీగార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో ఉత్తమ్‌ మాట్లాడుతూ తాను 16 సంవత్సరాలకే సైన్యంలో చేరి అభినందన్‌ మాదిరిగా యుద్ధ విమానాలు నడిపానని, ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో పనిచేశానని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తాము గెలిస్తే రాహుల్‌ ప్రధాని అవుతారని, తద్వారా పేదలకు ప్రతి నెలా రూ. 6 వేల ఆదాయం వచ్చే పథకాన్ని రాహుల్‌ అమలు చేస్తారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు