రైతు బీమా పథకం ఎలా ఉంది?: కేసీఆర్‌ ఆరా

6 Sep, 2018 02:30 IST|Sakshi

కొండపాక (గజ్వేల్‌): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం పనితీరు, బీమా సొమ్ముల చెల్లింపులపై సీఎం కేసీఆర్‌ బాధిత కుటుంబానికి స్వయంగా ఫోన్‌ చేసి ఆరా తీశారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో ఇటీవల కాశ పోశవ్వ అనే మహిళా రైతు (51) మృతి చెందారు. బుధవారం సీఎం కేసీఆర్‌ మృతురాలి నామినీకి ఫోన్‌ చేయగా, ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో కొండపాక మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దుర్గయ్యకు ఫోన్‌ చేసిన సీఎం.. పోశవ్వ కుటుంబానికి బీమా డబ్బులు ఎన్ని రోజులకు అందాయని, బీమా విషయంలో ఏ అధికారైనా లంచం అడిగారా? అని ఆరా తీశారు.

పోశవ్వ ఆగస్టు 24న మృతి చెందగా బీమా డబ్బులు అదే నెల 28న మంత్రి హరీశ్‌ చేతుల మీదుగా సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయంలో అం దించినట్లు దుర్గయ్య కేసీఆర్‌కు బదులిచ్చారు. పథకం ఎలా ఉందని కేసీఆర్‌ అడగ్గా, ‘చాలా బాగుంది సారూ’అంటూ దుర్గయ్య చెప్పడంతో సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ వివరాలను దుర్గయ్య ‘సాక్షి’కి తెలిపారు. సీఎం స్వయంగా మాట్లాడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు