మీకు చేతులెత్తి దండం పెడుతున్న..

22 Mar, 2020 01:18 IST|Sakshi

విదేశాల నుంచి వచ్చిన వారు రిపోర్టు చేయండి

సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌ : ‘విదేశాల నుంచి వచ్చిన వారికి చేతులెత్తి దండం పెట్టి వేడుకుంటున్న. మీరు మా బిడ్డలే. మా వోళ్లే. మీరు అత్యుత్సాహంతో బయటకు పోయి కుటుంబాన్ని, సమాజాన్ని చెడగొడతారు. దయచేసి మీరు కొంచెం ప్రభుత్వం చెప్పినట్టు వినాలె. సమాజహితం కోరి సహకరించాలె. విదేశాల నుంచి వచ్చామని మీ అంతట మీరు స్వచ్ఛందంగా చెప్పాలి’ అని సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘ఎక్కడో ఉంటే పట్టుకురావడం ఎందుకు? ఇవాళ ఒకాయన పారిపోతుంటే ఆలేరు కాడ పట్టుకొచ్చిండ్రు. ఇంకొకాయన ఢిల్లీ వెళ్తుంటే కాజీపేట కాడ పట్టుకొచ్చి గాంధీలో పడేసినం. అట్ల చేయకూడదు. నియంత్రణ పాటించాలి. ప్రపంచం ప్రపంచమే.. దేశం దేశమే పరేషానై ఉన్న ఈ సమయంలో ఈమాత్రం స్వీయ నియంత్రణ లేకపోతే కష్టమైతది. 

కుటుంబ సభ్యులైనా రిపోర్టు చేయాలి.. 
మీరు స్వచ్ఛందంగా స్థానిక వైద్యులు, పోలీసులు, తహశీల్‌ కార్యాలయంలో రిపోర్టు చేయండి. మిమ్మల్ని అరెస్టు చేయరు. మీకు ఏమైనా లక్షణాలుంటేనే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తరు. మీకు కొద్దిగా స్టాంప్‌ వేసి మీ ఇంటికాడే ఉంచుతరు. ఉదయం, సాయంత్రం మీ పరిస్థితి కనుక్కుంటరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. తద్వారా మీ క్షేమం, మీ కుటుంబ క్షేమం, రాష్ట్ర క్షేమం, దేశ క్షేమం, ప్రపంచ క్షేమం కూడా మానవజాతి క్షేమం దానిలో ఉంటది. విదేశాల నుంచి వచ్చిన వారు స్వయంగా రిపోర్టు చేయకుంటే వారి కుటుంబ సభ్యులు రిపోర్టు చేయాలి. ఇది మీ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఎవరో చెప్పాలె.. బలవంతం పెట్టాలని కాకుండా మీ అంతట మీరే ఐసోలేషన్‌లో ఉండాలి.

జ్వరం, జలుబు, దగ్గు, శ్వాసకోస ఇబ్బందులు వంటి లక్షణాలుంటే తక్షణమే రిపోర్టు చేయాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో మీ సహకారం చాలా అవసరం. ఈ వైరస్‌ ఇతర దేశాల నుంచి వస్తుంది కాబట్టి... మీరు ఇతర దేశాల నుంచి వస్తున్నారు కాబట్టి రిపోర్టు చేయాలి. మీరు రూ. 10 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కేవలం రిపోర్టు చేస్తే ప్రభుత్వమే అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తది, మందులిస్తది. చికిత్స ఖర్చులన్నీ పెట్టుకుంటది. గ్రామ సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు విజ్ఞప్తి. మీ గ్రామాలు/బస్తీల్లో విదేశాల నుంచి వచ్చిన వారుంటే సమాచారం ఇవ్వండి. 

700 అనుమానిత కేసులు...     
మార్చి 1 తర్వాత హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుతోపాటు ఇతర విమానాశ్రయాల ద్వారా 20 వేల మంది మన రాష్ట్రంలోకి వచ్చిన్రు. ఇప్పటివరకు 11 వేల మందిని గుర్తించి అధీనంలోకి తీసుకున్నం. ఇంకా కొందరిని గుర్తించాల్సి ఉంది. వాళ్లను 14 రోజులు మన నియంత్రణలో పెట్టుకొని వదిలేస్తాం. వాళ్లపై నిఘా కోసం 5,274 నిఘా బృందాలు/పర్యవేక్షక బృందాలు ఏర్పాటు చేసినం. 700 పైచిలుకు కోవిడ్‌–19 అనుమానితులుంటే వారిని తెచ్చి పరీక్షలు చేస్తున్నం. రాష్ట్రంలో ఇప్పటివరకు 21 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంతర్రాష్ట సరిహద్దుల్లో 52 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోకి వచ్చే వాళ్ల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సరిహద్దుల్లో 78 జాయింట్‌ బృందాలు పనిచేస్తున్నయి’.

ఐదుగురితో నిపుణుల కమిటీ.. 
వైద్యారోగ్య శాఖ, సీఎంవో, డీజీపీ కార్యాలయాల నేతృత్వంలో ఐదుగురితో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ, జాతీయ పరిస్థితులు, మన దగ్గర ఉత్పన్నమవుతున్న పరిస్థితులు, మనం కరెక్ట్‌ లై¯Œ లో ఉన్నమా లేదా? మనం తీసుకున్న చర్యలు సరిపోతున్నాయా లేవా? ఇంకేమైనా చేయాల్సి ఉందా? అని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఈ టీం సూచనలు ఇస్తుంటుంది.   

మరిన్ని వార్తలు