ముందు భగీరథ.. తర్వాత యాసంగి

25 Oct, 2017 00:57 IST|Sakshi

గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల్లోని లభ్యత నీటిపై సీఎం కేసీఆర్‌

తాగునీటి అవసరాలు పోను మిగతా నీటిని పంటలకు మళ్లించేందుకు అంగీకారం 

ఎస్సారెస్పీ కాల్వల సామర్థ్యం పెంచాలని అధికారులకు సూచన 

కాళేశ్వరం నీటితో చెరువులు నింపేలా కాల్వలు సిద్ధం చేయాలని ఆదేశం 

పాత కరీంనగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టుల్లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న నీటిలో మిషన్‌ భగీరథ అవసరాలకు పోగా మిగతా నీటిని యాసంగి పంటలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, ఎల్‌ఎండీ, సింగూరులో తాగునీటి అవసరాల మేర పక్కనపెట్టి మిగతా నీటిని పంటలకు మళ్లించడానికి అంగీకరించారు. లభ్యతగా ఉన్న నీటితో ఆయా ప్రాజెక్టుల కింది ఆయకట్టుతోపాటు ఘనపూర్‌ ఆనికట్, గుత్ప, అలీ సాగర్, లక్ష్మికెనాల్‌ కింది ఆయకట్టుకు నీరు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ నీటితో రెండో పంట పండించుకోవాలని, ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు మళ్లించాలని ఆదేశించారు.

నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎస్సారెస్పీ నీటి విడుదల, వినియోగానికి సంబంధించి పాత కరీంనగర్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు కె.తారక రామారావు, ఈటల రాజేందర్, చీఫ్‌ విప్‌లు కొప్పుల ఈశ్వర్, పాతూరి సుధాకర్‌ రెడ్డి, ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, బి.వినోద్‌ కుమార్, కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నీటి పారుదల, మిషన్‌ భగీరథ అధికారులు పాల్గొన్నారు.  

ప్రతి ఎకరాకు నీరందేలా.. 
నీటి పారుదల రంగానికి కావాల్సినన్ని నిధులు సమకూర్చడంతోపాటు, తెలంగాణకున్న నీటి వాటా మొత్తం వాడుకునేలా భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నందున.. వీలైనంత మేరకు పంటలకు సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల వెంట పడి పనులు చేయించుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న పాత కరీంనగర్‌ జిల్లాలో ప్రతీ ఎకరాకు నీరందేలా ఏర్పాటు జరగాలని స్పష్టం చేశారు. రామగుండం ప్రాంతంలో 20 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆదేశించారు.

ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్‌ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని సూచించారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎస్సారెస్పీ కాల్వల సామర్థ్యం పెంచాలని, అన్ని రకాల కాల్వలకు మరమ్మతులు చేయాలని చెప్పారు. ఎస్సారెస్పీలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. 

కాల్వలు సిద్ధం చేయండి.. 
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్ని రకాల చెరువులను గోదావరి నీటితో నింపుకునేలా కాల్వలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి కాళేశ్వరం నీరు అందుబాటులోకి వస్తున్నందున ఈ లోపుగానే పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులే ఈ పనుల విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పారు. గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బ్యారేజీ నిర్మిస్తున్నామని, అక్కడ 1,700 టీఎంసీల సగటు నీటి లభ్యత ఉందని చెప్పారు. ఈ నీటిని వాడుకోవడానికి అవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు.

గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు చిన్న నీటి వనరుల్లో 265 టీఎంసీల వాటా ఉందని 1974లో బచావత్‌ ట్రిబ్యునల్‌ తేల్చిందని, ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు ధ్వంసం కావడంతో అంత మొత్తంలో నీటిని వాడుకోలేకపోయామన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పూర్తి నీటి లభ్యత ఉంటుందని, అన్ని చెరువులు నింపుకునేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. 

మరిన్ని వార్తలు