తక్కువ విస్తీర్ణంలోనే అత్యాధునిక రాజధాని | Sakshi
Sakshi News home page

తక్కువ విస్తీర్ణంలోనే అత్యాధునిక రాజధాని

Published Wed, Oct 25 2017 12:55 AM

Analysis of intelligence on the AP capital city - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వం విపరీతమైన హడావుడి, అంతులేని ఆర్భాటం చేస్తోందని మేధావులు విమర్శిస్తున్నారు. నిజానికి ఎలాంటి ఆర్భాటం లేకుండానే అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దవచ్చని సూచిస్తున్నారు. ‘ప్రపంచ స్థాయి’ పేరుతో గొప్పలకు పోయే బదులు రాష్ట్ర పరిస్థితులు, ప్రజల స్థితిగతులను బట్టి రాజధాని నిర్మించాలని పేర్కొంటున్నారు. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటినా నూతన రాజధాని నిర్మాణంలో పురోగతి లేకపోవడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నుంచి 33 వేల ఎకరాల భూములను సేకరించి రెండేళ్లయినా ఇంతవరకూ పూర్తిస్థాయి నిర్మాణాలు చేపట్టకపోవడం లోపంగానే పరిగణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులను గ్రహించాలని చెబుతున్నారు. వేల ఎకరాల్లో కాకుండా తక్కువ విస్తీర్ణంలోనే అత్యాధునిక రాజధాని నిర్మించవచ్చని పేర్కొంటున్నారు. 

పరిపాలనా నగరంగా అమరావతి
ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయా రాయ్‌పూర్‌ను 8 వేల ఎకరాలతో ప్రారంభించి దశల వారీగా నిర్మించిన విషయాన్ని మేధావులు గుర్తుచేస్తున్నారు. అమరావతిలోనే ఆర్థిక, వాణిజ్య, విద్య, వైద్యం, క్రీడలు, పర్యాటకం వంటి అన్ని నగరాలు నిర్మించడం వల్ల ఉపయోగం ఉండదని తేల్చిచెబుతున్నారు. అమరావతిని పరిపాలనా నగరంగా అభివృద్ధి చేసి ఆర్థిక, విద్య, వైద్యం, ఇతర రంగాలను వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేయొచ్చని సూచిస్తున్నారు. ఐకానిక్‌ భవనాల పేరుతో విదేశాల చుట్టూ తిరగడం కంటే ప్రస్తుతం వెలగపూడిలో నిర్మించిన భవనాలనే పూర్తిస్థాయిలో సచివాలయం, అసెంబ్లీకి ఉపయోగించుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాత్కాలిక సచివాలయాన్నే శాశ్వతం చేసుకోవచ్చు 
‘‘డిజైన్ల పేరుతో సమయం వృథా చేయకుండా వెలగపూడిలోని తాత్కాలిక భవనాలనే సచివాలయం, అసెంబ్లీ కోసం ఉపయోగించుకోవచ్చు. అవి ఐకానిక్‌గా ఉండాలనే తాపత్రయం అనవసరం. వాటిని శాశ్వతంగా వాడుకుంటే డబ్బు, సమయం ఆదా అవుతాయి. హైకోర్టు లేదు కాబట్టి దాన్ని కట్టుకోవడంలో అభ్యంతరం ఉండదు. ఇతర పరిపాలనా భవనాలు కట్టుకోవచ్చు. వీటికి వేల ఎకరాల భూములు అవసరం లేదు. ఛత్తీస్‌గఢ్‌  రాజధాని నయా రాయ్‌పూర్‌ను చక్కగా కట్టుకున్నారు. నయా రాయ్‌పూర్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లకు మించి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి కోసం అనవసరమైన ఆర్భాటాలు ఎందుకు?’’   
 – వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి 

వేలాది ఎకరాలు అవసరం లేదు
‘‘రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాలు అవసరం లేదు. తక్కువ విస్తీర్ణంలోనే అద్భుతమైన రాజధాని నిర్మించుకోవచ్చు. రాజధాని అంటే కాంక్రీట్‌ భవనాలు కాదు. ఒకరోజు సింగపూర్‌ అంటారు. ఇంకొక రోజు షాంఘై అంటారు. పైగా బాహుబలి సెట్టింగులు అంటున్నారు. రాజధాని అమరావతి ఒక ఊహగానే ఉండిపోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి నిజానిజాలను అవగాహన చేసుకొని, అమరావతిలో అత్యంత ఆధునికమైన చిన్న రాజధానిని నిర్మించాలి. తీసుకున్న భూములను తిరిగి రైతులకు ఇచ్చి, ప్రభుత్వాన్ని ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి తీసుకెళ్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఏరో సిటీ, ఆర్థిక నగరాల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు’’     
– ఈఏఎస్‌ శర్మ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి 

అన్ని కార్యాలయాలు ఒకేచోట వద్దు 
‘‘రాజధాని పేరుతో అన్ని కార్యాలయాలను ఒకే చోట పెట్టడం సరైంది కాదు. రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేస్తే మంచిది. అమరావతి కేవలం పరిపాలనా నగరం అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, దాన్ని మహానగరంగా నిర్మిస్తామంటే అది కచ్చితంగా విఫలమవుతుంది. మహా నగరం అయితే విశాఖను ఎంచుకుంటే బాగుండేది. అమరావతి మహా నగరంగా అభివృద్ధి చెందాలంటే వందేళ్లు కూడా సరిపోవు’’ 
– ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి

Advertisement
Advertisement