కటాఫ్‌ మార్కులు ప్రకటించాల్సిందే..

25 Dec, 2018 01:24 IST|Sakshi

పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్‌) పోస్టుల భర్తీ విషయంలో హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల కటాఫ్‌ మార్కులను రాష్ట్ర స్థాయి, రిజర్వేషన్‌ కేటగిరీ, స్థానిక కేటగిరీల వారీగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హాల్‌టికెట్‌ వారీగా అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచాలంది. ఈ ఆదేశాల మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలిపింది. చట్ట విరుద్ధంగా రిజర్వేషన్లు కల్పించారన్న ఆరోపణలపై స్పష్టతివ్వాలని ఆదేశించింది. క్రీడల కోటాలో భర్తీ చేసే పోస్టుల విషయంలో అభ్యర్థుల మెరిట్‌ జాబి తాను తయారు చేశారో లేదో చెప్పాలంటూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. జేపీఎస్‌ పోస్టుల భర్తీ, నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అధికారులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ ఖమ్మం జిల్లాకు చెందిన బి.హరీశ్‌కుమార్, మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు జేపీఎస్‌లకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవా రం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారణ జరి గింది. రాష్ట్ర స్థాయి, రిజర్వు కేటగిరీ, స్థానిక కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితాను ప్రచురించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. చట్ట నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రిజర్వేషన్లు 50% మించాయని, జనరల్‌ అభ్యర్థులకు 45%, రిజ ర్వుడు అభ్యర్థులకు 55% రిజర్వేషన్లు కల్పించారన్నారు.

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి దీనిపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు. అభ్యర్థుల కటాఫ్‌ మార్కులను రాష్ట్ర స్థాయి, రిజర్వ్‌ కేటగిరీ, స్థానిక కేటగిరిల వారీగా ప్రకటించాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలంటే మార్కులనూ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని తేల్చి చెప్పారు. ఇదిలాఉంటే జేపీఎస్‌ పోస్టుల భర్తీలో క్రీడల కోటాను పరిగణనలోకి తీసుకోలేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కూడా న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు విచారణ జరిపారు. క్రీడల కోటా కింద మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల జాబితాను తయారు చేశారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.  

మరిన్ని వార్తలు