‘కస్తూర్బా’ నిర్మాణాలకు గ్రహణం

18 Aug, 2018 02:59 IST|Sakshi

రూ.92 కోట్లున్నా ముందుకు సాగని పనులు

నాలుగేళ్లుగా తాత్సారం చేస్తున్న కాంట్రాక్టర్లు

అద్దె భవనాల ఇరుకుగదులతో విద్యార్థుల అవస్థలు

సాక్షి, హైదరాబాద్‌: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)కు సొంత భవనాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విడతలవారీగా శాశ్వత భవనాలను కేంద్రం మంజూరు చేస్తున్నప్పటికీ వాటి నిర్మాణం సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లోనే విద్యార్థులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 475 కేజీబీవీలున్నాయి. వీటిలో దాదాపు 198 కేజీబీవీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే సొంత భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 34 కేజీబీవీలకు కేంద్రం భవనాలు మంజూరు చేసి ఒక్కోదానికి రూ.2.75 కోట్ల చొప్పున కేటాయించింది. రూ.93 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో రాష్ల్ర విద్యాశాఖ టెండర్లు పిలిచి అర్హతలున్న కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించి దాదాపు నాలుగు ఏళ్లు కావస్తున్నా వీటి నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి.

పర్యవేక్షణ కరువు...
కేజీబీవీల్లో అనాథ బాలికలతోపాటు అత్యంత నిరుపేద బాలికలకు వసతితోపాటు అక్కడే చదువుకునే వీలుంటుంది. నూరుశాతం బాలికలే ఉండడంతో ఆ భవనాలకు భద్రత కల్పించాలి. ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో సొంత భవనాలను మంజూరు చేస్తూ వచ్చింది. భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేసే ప్రక్రియ విద్యాశాఖ చూస్తుండగా నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) పర్యవేక్షిస్తోంది.

ఈ క్రమంలో కాంట్రాక్టర్లపై ఆజమాయిషీ ఈడబ్ల్యూఐడీసీకే ఉంది. సకాలంలో పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావాల్సిన ఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు విడతలవారీగా విద్యాశాఖ అధికారులు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ నిర్మాణ పనులపై స్పష్టత లేదు. ఈడబ్ల్యూఐడీసీ గణాంకాల ఆధారంగానే బిల్లులు చెల్లిస్తుండడంతో నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయనే అంశం విద్యాశాఖ అధికారుల వద్ద స్పష్టత లేకుండా పోయింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా