చివరి ‘నాలుగు’ మాటలు!

15 Jun, 2019 06:46 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నాలుగు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. పాత పాలకవర్గం పదవీ కాలం ముగియకపోవడంతో ఇన్నాళ్లూ ఉమ్మడిగానే సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇటీవల పరిషత్‌ ఎన్నికలు ముగియడం.. పాలక వర్గాల పదవీ కాలం దగ్గరపడడం.. కొత్త పాలకవర్గం కొలువుదీరిన తర్వాత ఏ జిల్లాలో ఆ జెడ్పీ సమావేశాలు జరుపుకోనున్నారు. ప్రస్తుతం చివరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ సమావేశం శనివారం నిర్వహించనున్నారు. పునర్విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిషత్‌లకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇక నుంచి ఆ జిల్లాల్లోనే జెడ్పీ సమావేశాలు నిర్వహించనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ పాలకవర్గం హయాంలో ఐదేళ్లలో రూ.42.12కోట్లతో ఉమ్మడి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. 2014, ఆగస్టు 6వ తేదీన ప్రారంభమైన జెడ్పీ పాలక వర్గ పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీన ముగియనున్నది. 2014లో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన గడిపల్లి కవిత ఎన్నిక కాగా.. రాష్ట్రస్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే పదవీ కాలం మరి కొద్దినెలల్లో ముగుస్తుందనగా.. చైర్‌పర్సన్‌ పదవికి ఆమె రాజీనామా చేయడంతో వైస్‌ చైర్మన్‌ బరపటి వాసుదేవరావు జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది. 2014లో జరిగిన జెడ్పీ తొలి సాధారణ సమావేశానికి చైర్‌పర్సన్‌ హోదాలో గడిపల్లి కవిత అధ్యక్షత వహించగా.. చివరి సాధారణ సమావేశానికి వైస్‌ చైర్మన్‌గా ఉన్న వాసుదేవరావు చైర్మన్‌ హోదాలో అధ్యక్షత వహించే అవకాశం లభించింది.

ఒకే పదవీ కాలంలో ఇద్దరు పనిచేసే అరుదైన అవకాశం ఈ హయాంలోనే లభించడం రాజకీయంగా విశేషంగా భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఖమ్మం జిల్లా పరిషత్‌ పాలకవర్గంలో ప్రస్తుత జెడ్పీటీసీలు ఎవరూ తిరిగి ఎన్నిక కాలేదు. అయితే జెడ్పీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బరపటి వాసుదేవరావు మాత్రం కొత్తగూడెం జిల్లా పరిషత్‌ పరిధిలోని పాల్వంచ జెడ్పీటీసీ సభ్యుడిగా తిరిగి ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌లో సభ్యుడిగా.. ఉమ్మడి జిల్లా పరిషత్‌కు చైర్మన్‌గా వ్యవహరించే అరుదైన అవకాశం సైతం ఆయనకే లభించింది. అనేక ప్రజా సమస్యలపై వివిధ రాజకీయ పక్షాల నుంచి గెలుపొందిన జెడ్పీటీసీ సభ్యులు.. జిల్లా పరిషత్‌ సాధారణ సమావేశం వేదికగా.. తమ వాణిని వినిపించడంతోపాటు రాష్ట్రస్థాయి సమస్యలపై స్పందించి తీర్మానాలు చేయాలని పట్టుపట్టిన సందర్భాలు సైతం అనేకం. జిల్లాను రెండేళ్ల క్రితం వణికించిన డెంగీ జ్వరాలను అరికట్టాలని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని జెడ్పీ సమావేశం వేదికగా అన్ని రాజకీయ పక్షాలు మూకుమ్మడిగా చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రజా సమస్యలపై ఈ ఐదేళ్లలో ప్రజాప్రతినిధులతోపాటు వివిధ పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు తమ గళాన్ని వినిపించారు. అయితే తమ మండలాల పరిధిలో అనేక సమస్యలున్నా వాటిని పరిష్కరించుకునే ఆర్థిక వెసులుబాటు, నిధులు మంజూరు చేసుకునే పరిస్థితి జెడ్పీటీసీలకు లేకపోవడంతో కొంత నిరాశ నిస్పృహలు వారిలో అలముకున్నాయనే ప్రచారం ఉంది.  
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌ సమావేశం శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించనున్నారు. వ్యవసాయం, ఉపాధిహామీ, వైద్య, ఆరోగ్య శాఖలపై సమీక్షించనున్నారు. దీనికి సంబంధించిన ప్రగతి నివేదికలను అధికారులు ప్రజాప్రతినిధులకు చదివి వినిపించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇదే చివరి సమావేశం కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించనున్నట్లు భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ సమీక్షలో రాయితీపై విత్తనాల సరఫరా, రైతుబంధు, రైతుబీమా, ప్రధానమంత్రి కృషి సమ్మాన్‌ నిధి, ఎరువుల సరఫరా, మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణపై.. అలాగే జిల్లా వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖల నిర్వహణపై పూర్తి చర్చ నిర్వహించనున్నారు. ఇక ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై.. వైద్య,  ఆరోగ్య శాఖ ప్రగతి నివేదికను అధికారులు ప్రజాప్రతినిధులకు వినిపించిన అనంతరం.. దీనిపై చర్చ కొనసాగనున్నది.
  
ఐదేళ్లలో ప్రత్యేక తీర్మానాలు 

2014 నుంచి నేటి జిల్లా పరిషత్‌ సమావేశం వరకు పలు అంశాలపై చర్చించి.. తీర్మానాలు చేశారు. 2019, సెప్టెంబర్‌ 29న నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించిన అనంతరం జిల్లాలోని గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలను రేషనలైజేషన్‌ కింద మూసివేయకుండా కొనసాగించాలని తీర్మానం చేశారు. జిల్లాలోని వర్షాభావ పరిస్థితుల దృష్టా అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని తీర్మానించారు. 2015, సెప్టెంబర్‌ 5న జరిగిన జెడ్పీ సమావేశంలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. 2017, నవంబర్‌ 5న నిర్వహించిన సమావేశంలో భక్తరామదాసు కళాక్షేత్రం జిల్లా ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆధీనంలోనే ఉండాలని తీర్మానించారు.

రూ.42.12కోట్లతో అభివృద్ధి పనులు 
ఐదేళ్లలో జిల్లా పరిషత్‌ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రూ.42,12,93,608లతో అభివృద్ధి పనులను చేపట్టారు. ఎస్‌ఎఫ్‌సీ, టీఎఫ్‌సీ, సీనరేజి, జెడ్పీటీసీ నిధులు, ఇసుక వేలం, స్టాంప్‌ డ్యూటీ ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్‌ డ్రెయిన్లు, పాఠశాల భవనాలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాలు అధికంగా చేపట్టారు. ఇందులో దాదాపు 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు