‘కారు’లోనే  కొండా దంపతులు

17 Sep, 2018 11:15 IST|Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: కొండా దంపతులను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగించేందుకు అధిష్టానం వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. పార్టీలో వారికి జరిగిన అవమానాన్ని సరిదిద్దేందుకు స్వయంగా గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు కేసీఆర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే గణపతి నవరాత్రులను కొండా దంపతులు తమకు కీడుదినాలుగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు వాళ్లు గడపదాటి బయటికి రారు. ఎలాంటి  కార్యక్రమాల్లోనూ పాల్గొనరు. ఈ నేపథ్యంలో నవరాత్రులు ముగిసిన అనంతరం వాళ్లు నేరుగా కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 105 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేసి, వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో సురేఖ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీన్ని అవమానంగా భావించిన కొండా దంపతులు హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన టికెట్‌ పెండింగ్‌ పెట్టడానికి కారణాలు ఏమిటో రెండు రోజుల్లోగా చెప్పాలని, లేదంటే బహిరంగ లేఖ రాసి టీఆర్‌ఎస్‌ను వీడుతానని అల్టిమేటం జారీ చేశారు. అనంతరం ఓ కీలక నేత ఫోన్‌ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, మీ విషయంలో కేసీఆర్‌ సానుకూల దృకృథంతో ఉన్నారని అంతా మంచే జరుగుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ బహిరంగ లేఖను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈలోగా గణపతి నవరాత్రులు రావడంతో వాళ్లు నిష్క్రియాశీలనలోకి వెళ్లిపోయారు.

 ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలంటే ఉమ్మడి వరంగల్‌ జిల్లా అత్యంత కీలకమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. చిన్నచిన్న కారణాలతో ఇక్కడే ఒకటి, రెండు సీట్లను కోల్పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. కొండా దంపతులు వరంగల్‌ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రత్యక్షంగా, మరో మూడు నియోజకవర్గాలను పరోక్షంగా ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్సీ వర్గాలు గులాబీ దళపతికి నివేదికలు అందించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన కేసీఆర్‌ ఇప్పటికే కొండా మురళితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

మీ రాజకీయ భవిష్యత్‌ను తనకు వదిలేసి జిల్లాలో పార్టీ కోసం పనిచేయాలని సూచించినటుŠల్‌ తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంతోపాటు మరో నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఒకవేళ రెండో టికెట్‌ ఇవ్వలేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సీఎం మాటలతో పునరాలోచనలో పడిన కొండా దంపతులు ఈ తొమ్మిది రోజుల్లో ఆలోచన చేసి, నవరాత్రుల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు