గులాబీ గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే

12 Dec, 2018 12:15 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లోకి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

89కి చేరిన టీఆర్‌ఎస్‌ బలం

సాక్షి, కరీంనగర్‌ : రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన కోరకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన చందర్‌ సీటు దక్కకపోవడంతో ఫార్వర్డు బ్లాక్‌ నుంచి పోటీచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమవరపు సత్యనారయణపై విజయం సాధించిన విషయం తెలిసిందే. రేపు (గురువారం) మధ్యాహ్నం కేసీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ తనకు మాతృసంస్థ అని అన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని చందర్‌ తెలిపారు. కాగా ఎన్నికల వరకు కూడా ఆయన టీఆర్‌ఎస్‌లోనే కొనసాగిన విషయం తెలిసిందే.

ఈ మేరకు బుధవారం కేసీఆర్‌ను ఆయన కలిసి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్‌ఎస్‌ బలం 88 స్థానాల నుంచి 89కి చేరింది. గత ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీచేసిన చందర్‌ సత్యనారాయణపై స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం, వైరా స్థానాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు