ఎవరూ అధైర్యపడొద్దు

14 Dec, 2016 03:16 IST|Sakshi
ఎవరూ అధైర్యపడొద్దు

సిరిసిల్లలో చేనేత కార్మికుడి ఆత్మహత్యపై కేటీఆర్‌ ఆవేదన
- మృతుడి కుటుంబానికి రూ.1.50 లక్షల సాయం.. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు
- కార్మికుల ఉపాధికి చర్యలు తీసుకుంటున్నాం


సాక్షి, హైదరాబాద్‌: సిరిసిల్లలో చేనేత కార్మికుడు దోమల రమేశ్‌ అత్మహత్య పట్ల  మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శిం చేందుకు చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ కమిషనర్‌ శైలజ రామయ్యర్‌ను సిరిసిల్లకు పంపించారు. మృతుడి కుటుంబానికి వీవర్స్‌ సొసైటీ నుంచి రూ.1.50 లక్షల ఆర్థిక సాయం, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు, పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చేనేత, పవర్‌ లూమ్‌ కార్మికుల ఉపాధి కోసం ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు.

ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వస్త్రం కార్మికుల నుంచే...
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రతి వస్త్రాన్ని చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల నుంచే సమీకరించాలని సూత్రప్రా యంగా నిర్ణయించినట్లు  కేటీఆర్‌ వెల్లడించారు. సిరిసిల్ల లో కార్మికుడి ఆత్మహత్య నేపథ్యంలో చేనేత, పవర్‌ లూం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆయన మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. కార్మికుల సంక్షేమం కోసం గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. పవర్‌లూమ్‌ కార్మికులు అత్యధి కంగా ఉన్న సిరిసిల్లలో కార్మికులకు ఈ ఏడాది రూ.70 కోట్ల విలువ గల స్కూల్‌ యూనిఫాంల కాంట్రాక్టు అప్పగించామని తెలిపారు. సిరిసిల్ల పవర్‌లూమ్‌ కార్మికులెవరూ అధైర్యపడవద్దన్నారు. చేనేత, మరమగ్గాల కార్మికులను సంక్షోభం నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

మరమగ్గాల కార్మికులకు రూ.5.65 కోట్ల రుణాలు మాఫీ చేశామని, రూ.7.19 కోట్లతో 50 శాతం విద్యుత్‌ సబ్సిడీ ఇచ్చామని పేర్కొన్నారు. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ ఫండ్‌ (టీయూఎఫ్‌) కింద రూ.4 కోట్ల బకాయిలను విడుదల చేశామన్నారు. కేంద్రం నుంచి రూ.15 వేలు, రాష్ట్రం నుంచి రూ.10 వేలు వెచ్చించి రాష్ట్రంలో 5వేల మగ్గాలను నవీకరించామన్నారు. రూ.80 నామమాత్రపు రుసుంతో మహాత్మాగాంధీ బుంకర్‌ బీమా యోజన కింద 6 వేల మంది కార్మికులకు జీవిత బీమా సదుపాయం కల్పించామన్నారు. ఈ పథకం కింద కార్మికుల ఇద్దరు పిల్లలకు ఏడాదికి రూ.1,200 చొప్పున ఉపకారవేతనాలు ఇస్తున్నామన్నారు. ముద్రా బ్యాంకు నుంచి 600 మంది కార్మికులకు రుణాలు ఇప్పిం చామన్నారు. ప్రభుత్వ విధానాలు, కార్మికు లకు లభించే రాయితీలు, సదుపాయాలతో త్వరలో చేనేత, టెక్స్‌టైల్‌ రంగాల కోసం ప్రత్యేక పాలసీ ప్రకటిస్తామన్నారు.

మరిన్ని వార్తలు