డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక.. కేటీఆర్‌కు ఉత్తమ్‌ షరతు

23 Feb, 2019 11:59 IST|Sakshi

ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తాం

బదులుగా ఓ ఎమ్మెల్సీ ఎన్నికకు మాకు సహకరించండి: ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు కాంగ్రెస్‌ మద్దతు కోరుతూ.. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, భట్టి విక్రమార్కతో భేటీ ముగిసింది. డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవానికి కాంగ్రెస్‌ మద్దతు తెలుపుతూనే.. ఓ షరతును పెట్టింది. ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇస్తామని, దానికి బదులుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ స్థానానికి తమకు సహకరించాలని కాంగ్రెస్‌ నేతలు కోరారు. దీనికి కేటీఆర్‌ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం తమ తుది నిర్ణయాన్ని తెలుపుతానని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఐదు స్థానాలకు పోటీ చేయడంపై ఉత్తమ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకూ సంఖ్యా బలం ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇదివరకే ప్రకటించారు. సంఖ్యా బలం లేకున్నా ఐదుగురిని నిలబెడుతామని సీఎం కేసీఆర్‌ ఎలా చెబుతారని భట్టి ప్రశ్నించారు. కాగా ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలలో కేసీఆర్‌ ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మరో స్థానాన్ని మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

మరిన్ని వార్తలు