ఇస్రోతో ‘చెరువుల పరిరక్షణ’

10 Oct, 2016 03:36 IST|Sakshi
ఇస్రోతో ‘చెరువుల పరిరక్షణ’

- దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ సర్కార్ శ్రీకారం: హరీశ్‌రావు
- సిద్దిపేటలో ఇస్రో వైజ్ఞానిక ప్రదర్శనలు
 
 సిద్దిపేట జోన్ :
చెరువుల పరిరక్షణకు ఇస్రోతో ఒప్పందం చేసుకున్నట్టు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని చెప్పారు. సతీష్ ధావన్  అంతరిక్ష కేంద్రం (షార్) శ్రీహరికోట ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణకు ఇస్రో సహకారం ఎంతో దోహదపడుతుందన్నారు.

చెరువుల అన్యాక్రాంతం, చెరువుల నీటి మట్టం, ఎఫ్‌టీఎల్ సమగ్ర రూపం, ఇసుక మట్టం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టత వస్తుందని చెప్పారు. అంతరిక్ష రంగంలో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు అన్ని రంగాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయన్నారు. ఇస్రో చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న మిషన్  భగీరథ, కాకతీయ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు మ్యాపింగ్ ఎంతో ఉపయోగకరమని చెప్పారు. అనంతం షార్ గ్యాలరీని మంత్రి ప్రారంభించారు. నమూనా క్షిపణులు, రాకెట్ నమూనాలు, అంతరిక్ష ప్రయోగాల గురించి షార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 బడ్జెట్‌లో మత్స్యశాఖకు రూ.100 కోట్లు
 మత్స్యకారులకు మహర్దశ పట్టనుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో మత్స్యశాఖకు కేవలం కోటి రూపాయల బడ్జెట్ మాత్రమే ఉండేదని, కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యశాఖ బడ్జెట్‌ను రూ.100 కోట్లకు పెంచినట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు