కల్యాణమైంది లక్ష్మిరాలేదు !

26 Feb, 2015 00:47 IST|Sakshi
కల్యాణమైంది లక్ష్మిరాలేదు !

హన్మకొండ అర్బన్ : ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించడం లేదు’ అన్నట్లు తయూరైంది జిల్లాలో కల్యాణలక్ష్మి పథకం అమలు తీరు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అధికారుల నిర్లక్ష్యం మూలంగా వారికి సకాలంలో అందని పరిస్థితులు నెలకొన్నారుు. పథకం ప్రారంభ సూచికగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో ఇటీవల పర్యటించిన  సమయంలో స్వయంగా లబ్ధిదారులకు రూ.51వేలు మంజూరు చేస్తున్నట్లు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. పెళ్లి సమయానికి 10 రోజుల ముందు డబ్బులు వివాహ కుటుంబానికి అందజేయూలని అధికారులకు సైతం సూచించారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా... ముఖ్యమంత్రి జిల్లా నుంచి వెళ్లిన తర్వాత అధికారులు ఈ విషయూన్ని మరిచిపోయూరు.

ఇందుకు ప్రత్యక్ష సాక్షే హన్మకొండ మండలం ఒండపర్తికి చెందిన మాదాసు కుమారస్వామి ఉదంతం. ఆయన కూతురి వివాహమై నెల రోజులైంది. ముఖ్యమంత్రి స్వయంగా ఆయనకు మంజూరు ఉత్తర్వుల కాపీ ఇచ్చినా... అవి ఇప్పటికీ అమలుకు నోచుకాలేదు.  అధికారులు షరామామూలుగా ఇదిగో... అదిగో... అంటూ  దళిత సంక్షేమ కార్యాలయం చుట్టూ తిప్పకుంటూనే ఉంటున్నారు. చివరకు ఆన్‌లైన్‌లో తప్పు దొర్లినట్లు తేల్చారు. వధువు ఫొటో కాకుండా భర్త ఫొటో కనిపిస్తున్నందున డబ్బులు మంజూరు కావడంలేదని తేల్చారు. వివాహమై నెల అయినా... సమస్యను పరిష్కరించడంలో మాత్రం శ్రద్ధ చూపకపోవడం గమనార్హం.

దీనిపై కుమారస్వామిని ‘సాక్షి’ సంప్రదించగా... ‘సమస్య పరిష్కారం కోసం దళిత సంక్షేమ శాఖ కార్యాలయానికి పలుమార్లు తిరిగిన. తాము ఒక లెటర్ ఇస్తామని, దాన్ని తీసుకుని హైదరాబాద్ కమిషర్‌ను కలిసి సమస్య చెప్పుకోమని అధికారులు సలహా ఇచ్చారు. అని ఆవేదనగా చెప్పారు. దీన్ని బట్టి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేసిన ఉత్తర్వులు అమలు కాకపోతే... ఇక సామాన్యుల విషయంలో పరిస్థితి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చని కళ్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
 
ఆన్‌లైన్ సమస్యలు
ప్రస్తుతం కళ్యాణలక్ష్మి  దరఖాస్తు సమయంలో చాలావరకు జన్‌ధన్ వంటి జీరో ఖాతాల నంబర్లు అధికారులకు ఇచ్చారు. సాంకేతిక సమస్య కారణంగా జీరో అకౌంట్‌లో రూ.51వేలు జమచేయడం కుదరడం లేదు. జిల్లాలో తాజా సమాచారం ప్రకారం ఈ పథకం కింద మొత్తం 430వరకు దరఖాస్తులు అందాయి. వీటిలో అధికారులు 170మంది వరకు అర్హులని గుర్తించి ప్రభుత్వానికి పంపారు. వీరిలో 100మందికి నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నా... ఎంత మందికి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యూయో  చెప్పలేమని వారు అంటున్నారు.  
 
 ఫిబ్రవరి 25 వరకు..
 దరఖాస్తులు        430
 అర్హులు            170
 మంజూరు        100
 పెండింగ్            70
 
 సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సి ఉంది
కళ్యాణలక్ష్మి పథకం అమలు విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తే పనులు సక్రమంగా, సకాలంలో ముందుకు సాగుతాయి. ఈవిషయం ఉన్నతాధికారులకు తెలిపాం. ఇక కుమారస్వామి విషయంలో అమ్మాయి ఫొటో చోట అబ్బాయి ఫొటో వస్తోంది. అందుకే మంజూరు విషయంలో ఇబ్బందులు వచ్చాయి. పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. దరఖాస్తు సమయంలో జీరో ఖాతాలు కాకుండా సేవింగ్ ఖాతాల ఇస్తే మంచింది. త్వరలో సమస్యలు పరిష్కరించి అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం.
 - కృష్ణవే ణి, దళిత సంక్షేమ శాఖ డీడీ

మరిన్ని వార్తలు