కారు ఎక్కేందుకు తహతహ!

16 Dec, 2015 00:40 IST|Sakshi
కారు ఎక్కేందుకు తహతహ!

గులాబీ కండువా కోసం నేతల క్యూ
ఎవరికి వారు జోరుగా ప్రయత్నాలు
అదే బాటలో.. నందీశ్వర్‌గౌడ్, సపాన్‌దేవ్
పటాన్‌చెరులో మారిన రాజకీయాలు
‘గూడెం’పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు!

 
 పటాన్‌చెరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.  నియోజకవర్గ కాంగ్రెస్, టీడీపీ ముఖ్య నేతలు గులాబీ కండువా కప్పుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిపై అనర్హత వేటు పడుతుందనే ఊహాగానాలు.. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తుండటంతో వారు కారు ఎక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్‌చెరులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నేతలు కొందరు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీకి చెందిన ఒక సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలు వేర్వేరుగా కోర్టు తీర్పు ప్రతులను ఎన్నికల కమిషన్‌కు అందజేసి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్ల్లు విశ్వసనీయంగా తెలిసింది. ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి, బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్ రాయించుకున్న కేసులో ఇటీవల పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష, రూ. 2,500 జరిమానా విధిస్తూ సంగారెడ్డి అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు నేపథ్యంలో మహిపాల్‌రెడ్డిపై అనర్హత వేటు పడినట్లేనని రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది.

లిల్లీ థామస్  కేంద్ర ప్రభుత్వం మధ్య నడిచిన కేసును అనుసరించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రజాప్రతినిధులపై ఏదైనా కేసులో శిక్షపడితే వెంటనే పదవీ కోల్పోతారని,సెక్షన్ 8(4) (రిప్రెజంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్) ప్రకారం ప్రజాప్రతినిధి తనపై వచ్చిన కోర్టు తీర్పుల(శిక్ష)పై ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. కాని ఆ సెక్షన్‌ను సుప్రీంకోర్టు రాజ్యంగ విరుద్ధమని స్పష్టం చేసింది.  ఇదే యాక్ట్‌కు లోబడి రషీద్ మసూద్ ఎంపీ పదవిని, లాలు ప్రసాద్ యాదవ్, జయలలిత, తాజాగా కమల్ కిషోర్ భగవత్ కూడా ఎమ్మెల్యే పదవి కోల్పోయారనే ఉదాహరణలను స్థానిక రాజకీయ నేతలు ఉటంకిస్తున్నారు. ఇప్పటికే సంగారెడ్డి అడిషనల్ జ్యుడీషయల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రెట్ తీర్పు కాపీని,  కోర్టు తీర్పు నేపధ్యంలో ఇప్పటి వరకు దేశంలో  పదవులు కోల్పోయిన నేతల వివరాలు, వారికి సంబంధించిన కేసులు, చట్టాల వివరాలను స్థానిక నేతలు ఎన్నికల కమిషన్‌కు అందజేసినట్టు సమాచారం.
 
 గులాబీ కండువా కప్పరూ..
 మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నందీశ్వర్‌గౌడ్ కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల అనంతరం నందీశ్వర్‌గౌడ్‌కు, కాంగ్రెస్‌పార్టీకి మధ్య తీవ్ర అంతరం పెరిగింది. అవకాశం దొరికితే మరో రాజకీయ పార్టీ వేదికగా చేసుకోవలనే ఆలోచనతో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.
  గత సాధారణ ఎన్నికల్లోనే అతణ్ణి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమైన నందీశ్వర్‌ను ఆఖరి క్షణంలో అప్పటి మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆపారు.
 
 అనంతరకాలంలో డి. శ్రీనివాస్ కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో నందీశ్వర్‌గౌడ్ కూడా అదే దారిలో నడవాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. డి. శ్రీనివాస్ సిఫారస్‌తో టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరడానికి పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి హరీశ్‌రావును కూడా కలిసి పార్టీలోకి తీసుకోవాలని కోరినట్లు భొగట్టా.
 ఇక టీడీపీ విషయానికి వస్తే.. జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. ఆ పార్టీకి నాయకులే కాదు కార్యకర్తలు, ఓటర్లు క్రమంగా దూరమవుతున్నట్టు పరిస్థితులే తెలియజేస్తున్నాయి.
 
 నావ మునగక ముందే ఒడ్డుకు చేరుకోవాలనే యత్నంలో టీడీపీ నాయకులున్నారు. అందులో భాగంగానే టీడీపీ నాయకుడు సపాన్‌దేవ్ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తితో ఉన్నారు. నిజానికి సపాన్‌దేవ్ కూడా సాధారణ ఎన్నికల తరువాత టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు ద్వారా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను కూడా కలిసి సపాన్‌దేవ్ తన మనుసులో మాట చెప్పినట్లు తెలిసింది.  
 
 ఇదిలా ఉండగా.. మహిపాల్‌రెడ్డికి రెండున్నర ఏళ్ల జైలు శిక్ష విధించిన మెజిస్ట్రేటే పైకోర్టుకు వెళ్లడానికి నెల రోజుల గడువు ఇచ్చారని,  కింది కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు సమర్థిస్తేనే మహిపాల్‌రెడ్డిపై అనర్హత వేటు పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  ఒక వేళ కింది కోర్టు తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే ఆయన పదవికి ఎలాంటి ప్రమాదం ఉండదని వారు చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు