లైసెన్స్‌డ్‌ గన్స్‌ సరెండర్‌

28 Mar, 2019 16:27 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలో 376  ఆయుధాలు వెనక్కి 

బ్యాంకు సెక్యూరిటీకి మాత్రం మినహాయింపు

ఇప్పటివరకు ఆదిలాబాద్‌లో 1,360 మంది బైండోవర్‌

ఆదిలాబాద్‌ అర్బన్‌: లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసు అధికారులు ఉమ్మడి జిల్లాలో లైసెన్స్‌డ్‌ గన్‌లు వెనక్కి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్‌ దగ్గర పడుతుండడంతో ఎన్నికల పరిణామాలపై ఎప్పటికప్పుడు నిఘాపెంచుతున్నారు. ఇందులో భాగంగానే లైసెన్స్‌డ్‌ ఆయుధాలను పలువురి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆయాపోలీస్‌స్టేషన్లలో, ఆయుధగారాల్లో ఈ ఆయుధాలు డిపాజిట్‌ అయ్యాయి.

స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేయనున్నారు. ఆయుధాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. బ్యాంకుల వద్ద విధులు నిర్వర్తించే సెక్యూరిటీకి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకొని ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేసిన విషయం తెలిసిందే.

ఉమ్మడి జిల్లాలో 376 స్వాధీనం 
లైసెన్స్‌డ్‌ ఆయుధాలను ఎక్కువ డబ్బు సంపాదించే వారు, ఇతరుల నుంచి ప్రాణహాని ఉన్న వ్యక్తులు, వ్యాపారులు, సెలబ్రిటీస్, హీరోలు, ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు ఆత్మరక్షణకోసం ఆయుధాలు ఉపయోగిస్తుంటారు. ఎన్నికల నిబంధనలు, చట్టం ప్రకారం లైసెన్స్‌డ్‌ ఆయుధాలను ఎన్నికల సమయంలో సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో మొత్తం 376 ఆయుధాలు సరెండర్‌ అయ్యాయి. ఇందులో ఆదిలాబాద్‌లో కేవలం 17 ఆయుధాలు ఉండగా, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాలు కలుపుకొని 359 ఆయుధాలు ఉన్నాయి.

లైసెన్స్‌ లేని ఆయుధాలను వినియోగించడం చట్టరీత్య నేరమన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లైసెన్స్‌ పొందేందుకు జిల్లా మేజిస్ట్రేట్‌ (కలెక్టర్‌)కు దరఖాస్తు చేసుకుంటారు. ఆయుధ లైసెన్స్‌ ఎందుకు అవసరమో దరఖాస్తులో వివరంగా తెలియజేయాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి విజ్ఞప్తి మేరకు జిల్లా మెజిస్ట్రేట్‌ దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. దరఖాస్తులో పేర్కొన్న విషయం విచారణలో సరైనదిగా తేలితే సదరు వ్యక్తికి లైసెన్స్‌ జారీ చేస్తారు. ఈ లైసెన్స్‌ను ఏటా జనవరిలో రెన్యూవల్‌ చేస్తారు.

ఆదిలాబాద్‌లో 1,360 మంది బైండోవర్‌.. 
ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వ్యవహరించి గోడవలు సృష్టించే వారిని బైండోవర్‌ చేస్తారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆదిలాబాద్‌ జిల్లాలో 1,360 మందిని బైండోవర్‌ చేశారు. వీరందరిని మండల మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

ఆయుధాల డిపాజిట్‌ ఇలా..
నిర్మల్‌టౌన్‌: ఎన్నికల సమయంలో లైసెన్స్‌డ్‌ గన్స్‌ ఉన్న వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వాటిని డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్‌ చేసిన అనంతరం వారికి సంబంధిత పోలీస్‌ అధికారి రిసిప్ట్‌ అందిస్తారు. ఈ రిసిప్ట్‌ను సదరు వ్యక్తి తన వద్ద ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం రిసిప్ట్‌ ఆధారంగా ఎవరి లైసెన్స్‌డ్‌ గన్‌లను వారికి పోలీస్‌ అధికారులు అప్పగిస్తారు. డిపాజిట్‌ చేసిన లైసెన్స్‌డ్‌ గన్‌లను భద్రత దృష్ట్యా ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో భద్రత పరుస్తారు. 

మరిన్ని వార్తలు