నేటి నుంచి నామినేషన్ల పర్వం

18 Mar, 2019 14:24 IST|Sakshi

25వ తేదీవరకు స్వీకరణ    

 26న స్క్రూట్నీ,  27,28 తేదీల్లో ఉపసంహరణలు 

సాక్షి, నల్లగొండ : లోక్‌సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం సోమవారం ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసి ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తిచేసింది. అదే విధంగా పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి సిబ్బంది నియామకం, శిక్షణ, పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు, తదితర అవసరమైన అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా మొదలైంది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ చేసినప్పటి నుంచి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయవచ్చు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 26వ తేదీన నామినేషన్ల స్క్రూట్నీ జరగనుంది. 27, 28 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ప్రకటించనున్నారు.

కలెక్టరే రిటర్నింగ్‌ అధికారి..
కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ నల్లగొండ పార్లమెంట్‌కు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి. ఆయనే పార్లమెంట్‌కు సంబంధించి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నల్లగొండ పార్లమెంట్‌ పరిధిలోని  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సహాయ రిటర్నింగ్‌ అధికారిని కూడా నియమించారు. వారు అక్కడ ఎన్నికల విధులను నిర్వహించనున్నారు. కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ రిటర్నింగ్‌ అధికా రిగా నామినేషన్లను స్వీకరిస్తారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఏప్రిల్‌ 11న పోలింగ్‌..
పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా మొదటి విడత తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. అయితే ఓట్లు లెక్కింపు మాత్రం దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఉటుంది. పోలింగ్‌ జరిగిన తర్వాత ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలన్నింటినీ నల్లగొండలోని దుప్పలపల్లి వద్దగల ఎఫ్‌సీఐ గోదాములోనే భద్రపర్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

దుప్పలపల్లి గోదాముల్లో ఏర్పాట్లు
మొదటి విడత పార్లమెంట్‌ ఎన్నికలకు ఏప్రిల్‌ 11న పోలింగ్‌ జరగనుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూంలో భద్రపర్చి మే 23వ తేదీన దేశవ్యాప్తంగా ఒకేసారి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అయితే నల్లగొండ పార్లమెంట్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపును కూడా దుప్పలపల్లి ఎఫ్‌సీఐ గోదాములోనే చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పేర్కొన్నారు. 

ప్రధాన పార్టీల్లో ఖరారు కాని అభ్యర్థులు..
నల్లగొండ పార్లమెంట్‌కు సంబంధించి ప్రధాన పార్టీ అభ్యర్థుల ఖరారు ఇంకా పూర్తికాలేదు. ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్‌ పార్టీలోని అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగుతుంది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నందున ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేయడం మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు