కోట్లున్నా..కారుండదు..ఎందుకు?

15 Nov, 2023 04:17 IST|Sakshi

నేతల ‘అఫిడవిట్లు’ వెనుక కారణమిదే  

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో ఓ అంశం సాధారణ ప్రజల్లో కొత్త ఆలోచనను రేపుతుంటుంది. మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్న కొందరు ‘నాకు సొంత కారు లేదు’ అని నామినేషన్ల అఫిడవిట్‌లో చూపుతుంటారు. వారి ఆస్తులు మాత్రం రూ.కోట్లలో ఉంటాయి.

ఇంత ఆస్తి పరులకు సొంత వాహనం ఎందుకు ఉండదు..?? కోట్లకు పడగలెత్తిన బడా నేతలు సొంత వాహనాన్ని కొనుక్కునే పరిస్థితిలో లేరా..?? వారి ఇళ్ల ఎదుట డజనుకుపైగా కనిపించే ఖరీదైన విలాసవంతమైన కార్లు ఎవరివి..??  ఈ అనుమానాలు  చాలా మంది బుర్రలను తొలిచేస్తూంటాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కొందరు మంత్రులు సహా పలు పార్టీలకు చెందిన బడా నేతలు సొంత కారు లేదని ప్రకటించారు. ఇలా ఎందుకంటే.. 

ఏ కేసు పెట్టినా.. వెళ్లాల్సిందే... 
ఆ వాహనం ఏదైనా వివాదంలో చిక్కుకున్నా, ప్రమాదానికి గురైనా న్యాయపరమైన అంశాల్లో యజమాని పేరు నమోదవుతుంది. ప్రమాదానికి గురైన సందర్భాల్లో యజ మాని వాహనంలో ప్రత్యక్షంగా లేకున్నా,  కేసులను మాత్రం స్వయంగా ఎదుర్కొనక తప్పదు. పోలీసులు,  న్యాయస్థానం ముందు యజమాని ప్రస్తావన రావటంతోపాటు, నేరుగా హాజరు కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వాహన యజమానులు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉన్నప్పుడు ఇవి ఇబ్బందికరంగా మారుతాయి. ఇక వాహనాలు నేతల పేర్లతో లేకున్నా, కొన్ని సందర్భాల్లో వాటిపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్టిక్కర్లు ఉంటుంటాయి.

అలా ఉన్న కార్లు ప్రమాదాలకు గురైనా, ఇతర వివాదాల్లో చిక్కుకున్నా.. ఆ స్టిక్కర్ల వల్ల నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భాలు ఎన్నో.  కేవలం స్టిక్కర్ల ద్వారానే అలాంటి పరిస్థితి ఎదురైతే, వాహన రిజిస్ట్రేషన్‌లో యజమానిగా నేతల పేర్లు ఉంటే వారికి మరిన్ని ఇబ్బందులు సహజం. ఈ పరిణామాలను ముందుగా ఊహించే కొందరు బడా నేతలు తమ పేర్లతో వాహనాలు కొనటం లేదు. ఇది కేవలంనేతలకే పరిమితం కాలేదు.

పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థలవారు, బడా వ్యాపారులు, సినిమా నటులు.. ఇలా చాలా రంగాలకు చెందిన వారిలో ఈ ధోరణి ఉంది. నామినేషన్‌ వేసిన ఓ మంత్రి తన అఫిడవిట్‌లో సొంత వాహనం లేదని చూపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన విద్యా సంస్థల అధిపతిగా ఉన్నారు.  అప్పుడు గానీ,  ఇప్పుడు గానీ ఆయన వాహనాలను తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకోవటం లేదు. 

ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి రావటం..
వాహన రిజిస్ట్రేషన్  సమయంలో యజమాని ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి ఉండటం కూడా దీనికి మరో కారణం. అక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ తంతు పూర్తి చేసే వరకు ఉండటం ఇబ్బందిగా భావిస్తున్నారు. 

నామ బలం.. అభిమానంతో కొంతమంది..
వాహనాన్ని కొనేప్పుడు ఎవరి పేరుతో కొంటే మంచి జరుగుతుందో అన్న నమ్మకాలు కొందరిలో ఉంటాయి. ప్రతి పనికీ ముహూర్తాలు, నామ బలం చూసుకునే అలవాటు ఉన్నవారు దీనికి ప్రాధాన్యం ఇస్తారు. తమ పేరుతో కలిసి రాదని భావిస్తే వేరేవారి పేరుతో కొంటుంటారు. ఇక కొందరు ఆప్తులుగా భావించే వారిపై ఉన్న అభిమానంతో వారి పేరుతో వాహనా­లు కొంటుంటారు. ఇది కూడా వాహనాలు యజమాని పేరుతో కాకుండా ఇతరుల పేరుతో ఉండటానికి కారణమవుతోంది. 

ఆదాయ పన్నుల భారం లేకుండా..
ఆయనో పారిశ్రామికవేత్త.. రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఇంటి ఆవరణలో డజనుకుపైగా విలాసవంతమైన కార్లు ఉంటాయి.. కానీ ఏదీ ఆయన పేరుతో ఉండదు. వాటి ఖర్చు, బ్యాంకు లోన్‌ల వ్యవహారం ఆయనకు సంబంధం లేదు. అన్నీ ఆయన సంస్థల నుంచే భరిస్తున్నట్టు చూపుతున్నారు. దీంతో ఆదాయపన్నులో ఆ కార్ల ఖాతా ఉండటం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పారిశ్రామిక వేత్తలు, విద్యా సంస్థల అధిపతులు దాదాపు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు.  

-గౌరీభట్ల నరసింహమూర్తి

మరిన్ని వార్తలు