ఆయువు మింగిన అప్పులు

1 Aug, 2015 23:40 IST|Sakshi
ఆయువు మింగిన అప్పులు

 పంట ఎండిపోవడం, అప్పులు తీరేమార్గం లేదని ఉరివేసుకున్న అన్నదాత
 పరిగి మండలం రూప్‌ఖాన్‌పేట్‌లో విషాదం
 
 పరిగి : కష్టపడి సాగుచేసిన పంట ఎండిపోవడంతో ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన పరిగి మండల పరిధిలోని రూప్‌ఖాన్‌పేట్ లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నసాయన్నొళ్ల గోపాల్(38) తనకున్న మూడు ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఖరీఫ్ సీజన్‌లో ఆయన మొక్కజొన్న పంట వేశాడు. కుటుంబ అవసరాలు, పెట్టుబడి కోసం తెలిసిన వారి వద్ద రూ.లక్ష అప్పు చేశాడు.

పరిగిలోని ఏడీబీ(అగ్రికల్చర్ డెవలప్‌మెంటు బ్యాంకు)లో గతంలో రూ. 40 వేలు రుణం తీసుకోగా వడ్డీతో కలిసి అది రూ. 70 వేలకు చేరుకుంది. ఇటీవలి వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయింది. గోపాల్ శుక్రవారం ఉదయం పరిగి ఏడీబీకి అప్పు కోసం వెళ్లగా గతంలో తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించాలని స్పష్టం చేశారు. తన వద్ద డబ్బు లేకపోవడంతో గోపాల్ మదనపడ్డాడు. ఓ పక్క పంట ఎండిపోవడం.. మరోపక్క అప్పు పుట్టకపోవడం, కుటుంబం గడవడం కష్టంగా ఉండడంతో ఏంచేయాలో తోచడం లేదని గోపాల్ భార్య అమృతమ్మతో చెప్పి మనస్తాపానికి గురయ్యాడు.

శుక్రవారం రాత్రి ఆయన భార్యాపిల్లలతో కలిసి భోజనం చేశాడు. ఇంట్లో అందరూ నిద్రించాక బయటకు వెళ్లి పక్కనేఉన్న పూరి గుడిసెలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం కుటుంబీకులు నిద్రలే చి చూడగా గోపాల్ కనిపించలేదు. కొద్దిసేపటికి పూరిగుడిసెలో మృతదేహంగా వేలాడుతూ కనిపించాడు. మృతుడి భార్య అమృతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి కూ తుళ్లు అనిత(12), శిరీష(10) శ్రీలత(3) ఉన్నారు.

 అధికారులపై చర్యలు తీసుకోవాలి..
 గోపాల్‌కు అప్పు ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చి  మృ తుడి కుటుం బాన్ని ఆదుకో వాలన్నారు.

మరిన్ని వార్తలు