తొక్కిసలాటలకు చెక్‌

22 Feb, 2019 01:20 IST|Sakshi

సైన్స్‌ ఆధారంగా మార్గం కనిపెట్టిన మద్రాస్‌ ఐఐటీ

కొన్ని ఉత్సవాలకు జనం లక్షల్లో వస్తుంటారు. ముందుకు అడుగేయలేనంత దట్టంగా గుమిగూడుతుంటారు. అలాంటి సందర్భాల్లో ఏమైనా తొక్కిసలాటలు జరగవచ్చు. ఊహించని విషాదాలు చోటు చేసుకోవచ్చు. మరి వాటిని నివారించడమెలా? దీనికి సైన్స్‌ ఏమైనా పరిష్కారం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు ఐఐటీ మద్రాస్‌ శాస్త్రవేత్తలు.  ఇందుకు సాయపడే అల్గారిథమ్‌ను వారు తయారు చేశారు. గుంపులో తలెత్తిన అల్లర్లు, తొక్కిసలాట వంటివి నివారించే దిశగా పోలీసులకు ఎక్కడ మోహరించాలనే∙విషయాన్ని ఈ పద్దతి ద్వారా గ్రహించవచ్చని, తద్వారా  గందరగోళాన్ని ఆదిలోనే నివారించవచ్చని వారు చెబుతున్నారు.  ఫిజికల్‌ రివ్యూ లెటర్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన సంబంధిత పరిశోధనాంశం ప్రకారం – కంప్యూటర్‌ సిమిలేషన్‌ను ఉపయోగించి సురక్షిత తరలింపు విధానాలు రూపకల్పన చేసుకునేందుకు సైతం ఇది దోహదపడుతుంది. 

కుంభమేళాకి కోట్లాది మంది జనం తరలివస్తుంటారు. ఒక్కోరోజు రెండు కోట్ల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. ఇలాంటి చోట ఏవైనా దుర్ఘటనలు సంభవిస్తే నష్టం భారీగానే వుంటుంది. ఇలాంటి దుర్ఘటనలను అడ్డుకునే లక్ష్యంతో, అతి జనసమ్మర్థాన్ని మెరుగైన పద్ధతుల్లో నియంత్రించే ఉద్దేశంతో తాము ఈ అల్గారిథమ్‌ను రూపొందించామంటున్నారు  ఈ శాస్త్రవేత్తలు.    అసలు ఇలాంటి తొక్కిసలాటలు ఎలా మొదలవుతాయో గమనించగలిగితే వాటిని నివారించగల మార్గాలను కూడా మనం గుర్తించవచ్చునని చెబుతున్నారు మద్రాస్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ మహేశ్‌ పంచాగ్నుల. తొక్కిసలాటల తాలూకూ తొలి సంకేతాలను అర్థం చేసుకుని, ఎక్కడ పోలీసు బలగాలు వుంచాలనేది గ్రహించడం చాలా ముఖ్యమంటున్నారు ఈయన. జనసమూహాలను క్రమబద్ధీకరించేందుకు కొన్ని చోట్ల ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేయడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదంటున్న ఈ శాస్త్రవేత్తలు.. బయటకు వేగంగా పోవడానికి వీల్లేని ప్రదేశాల్లో జనం దట్టంగా కూడినపుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోగలవో విశ్లేషించారు. ద్రవ పదార్థాలు ప్రవహించే తీరును విశ్లేషించే ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ను ఆపాదిస్తూ జనసమూహం పద్ధతి ప్రకారం ముందుకు సాగేలా చూడాలని  బృందంలో భాగంగా వున్న సుమేష్‌ పి తంపి, అజింక్యా కులకర్ణి  చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు