మహబూబ్‌నగర్‌ లో 65.30 శాతం పోలింగ్‌

12 Apr, 2019 11:24 IST|Sakshi

సాక్షి , మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా టెక్నికల్‌ సిబ్బంది వెంటనే స్పందించి  వాటిని సరిచేస్తూ అవసరమైన చోట ఈవీఎంలు మారుస్తూ ఆటంకం లేకుండా జాగ్రత్త పడ్డారు. పోలీసుశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నా పోలింగ్‌ కు ఇబ్బంది లేకుండా వ్యవహరించారు.

14 అసెంబ్లీ సెగ్మెంట్లలో.. 
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న  14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరగడంతో పోలీసులు, ఎన్నికల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్‌ శాతం భారీగా తగ్గింది. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలో 7.95 శాతం, నాగర్‌కర్నూల్‌ పరిధిలో 12.49 శాతం పోలింగ్‌ తగ్గింది. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు రెండు లోక్‌సభ స్థానాల్లోనూ మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరచలేదు.

పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కపోత తట్టుకోలేక చాలామంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక చోట్ల సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్‌ పుంజుకుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఐదు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలో ఉన్న పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి సమస్యలను ఎప్పటికప్పుడు అదిగమించారు. మహబూబ్‌నగర్‌లో 1,871, నాగర్‌కర్నూల్‌లో 1,936 కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ల ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలో మొత్తం 7,53,935 మంది మహిళా ఓటర్లు ఉండగా 4,89, 453 మంది ఓటేశారు. అలాగే 7,51,216 మంది పురుషుల్లో 4,93,435 మంది ఓటేశారు. 

బహిష్కరణల పర్వం  
ఒక్క జడ్చర్ల మండలంలోనే ప్రజలు మూడు చోట్ల ఎన్నికలు బహిష్కరించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ భూ నిర్వాసితులు తమకు సరైన పరిహారం ఇవ్వలేదని, ఇచ్చే పరిహారం రూ.15 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఎన్నికలను బహిష్కరించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బైఠాయించారు. మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వటంతో 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. అదే మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామం బాదేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు పోలింగ్‌ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్‌ సునితలు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు ఎస్పీ రెమా రాజేశ్వరి అక్కడికి చేరుకుని పోలింగ్‌ కేంద్రానికి అడ్డుగా కూర్చోవటం చట్టరిత్యా నేరమని, సమస్యలు ఏమైనా ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని మహిళలకు సముదాయించారు. అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించటంతో ధర్నా విరమించారు.

దీంతో బూరెడ్డిపల్లిలో గంటన్నర ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారని, తమ సమస్యలను ఎవరు పట్టించుకోవటం లేదంటూ జడ్చర్ల మండల కేంద్రం బాదేపల్లి గంజ్‌ పోలింగ్‌ కేంద్రంలో బుడగజంగం కులస్తులు ఎన్నికను బహిష్కరించి పోలింగ్‌ కేంద్రం ముందు ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్‌ నాయకులు జోక్యం చేసుకుని వారితో మాట్లాడారు. దీంతో అక్కడ గంటసేపు ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటి స్ధానంలో ఇతర ఈవీఎంలు అమర్చారు. దీంతో పలు చోట్లా పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు