ప్రాణం పోయినా పంట భూములు ఇవ్వం

10 Feb, 2018 19:09 IST|Sakshi
రైతులతో మాట్లాడుతున్న ఆర్డీఓ

అధికారులు మాట ఇచ్చి మోసం చేశారు

గోదావరిలో కలిసిన పట్టా భూములకు పరిహారం ఇవ్వాలి

బెగులూరు, సూరారం రైతుల డిమాండ్‌

మహదేవపూర్‌: మేడిగడ్డ బ్యారేజీకి అవసరమైన సామగ్రి, యంత్ర పరికరాలను తరలించేందుకు చేపట్టిన రోడ్డు నిర్మాణానికి ప్రాణాలు పోయినా పంట భూములను ఇచ్చే ది లేదని బెగులూరు, సూరారం  రైతులు తేగేసి చెప్పారు. బ్యారేజీ వల్ల ముంపునకు గురవుతున్న పంట భూముల ను ఇవ్వాలని గతంలో జాయింట్‌ కలెక్టర్, ఆర్డీఓ, ప్రాజెక్టు సీఈ, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అడిగిన సమయంలో గోదావరిలో కోతకు గురైన తమ పట్టా భూములకు కూడా  ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేయగా అంగీకరించారని, ఇప్పుడు  మాట మార్చి ఎకరానికి రూ.7.50 లక్షలు మాత్రమే ఇస్తామంటున్నారని రైతులు  ఆరోపించారు. రైతులను మభ్యపెట్టి మాయ చేసి ఎంజాయ్‌మెంట్‌ సర్వే చేశారని, కొంత మేర దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం పనులను చేపట్టారని రైతులు మండిపడ్డారు. బెగులూరు గ్రామ శివారులో 78 ఎకరాలు, సూరారం శివారులో 48 ఎకరాలు కోతకు గురై గోదావరిలో కలిసింది. ఇప్పటికే బినామీ పేర్లతో పంట భూములు కొనుగోలు చేసి భూసేకరణలో భారీ కుంభకోణం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న సమయంలో గోదావరి ముంపు భూముల సమస్య తెరపైకి రావడంతో అధికారుల్లో గుబులు మొదలైంది.

పంట భూములు ఇచ్చేది లేదు
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం భూసేకరణ సమయంలో గోదావరిలో కలిసిపోయిన పట్టా భూములకు కూడా పరిహారం చెల్లిస్తామని మాట ఇచ్చిన అధికారులు రైతులను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే పంట భూములు ఇచ్చేది లేదు. –బుర్రి శివరాజు, రైతు

ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించాలి
మేడిగడ్డ బ్యారేజీ అప్రోచ్‌ రోడ్డు నిర్మాణానికి వ్యవసాయ యోగ్యమైన భూమికి చెల్లిస్తున్న విధంగా గో దావరిలో కలిసిపోయిన భూమికి కూడా రూ.10.50 లక్షలు చెల్లిస్తేనే భూములు ఇస్తాం. లేకపోతే అధికారులను పంట భూముల్లో కాలుపెట్టనివ్వం. –పంతంగి రాజయ్య,సింగిల్‌ విండో డైరెక్టర్‌

దౌర్జన్యం చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం
రూ.82 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న బీద రైతులకు ఎకరానికి రూ.10.50 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు. ప్రాణాలు పోయినా సరే పంట భూములను ఇవ్వంగాక ఇవ్వం. దౌర్జన్యంగా పంట భూములను లాక్కుంటే కోర్టుకెళ్తాం. –పంతంగి తిరుపతి, రైతు

మరిన్ని వార్తలు