మేడిగడ్డ బ్యారేజీపై కేంద్ర బృందం వివరణ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

4 Nov, 2023 18:21 IST|Sakshi

సాక్షి, మధిర: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. ప్రచారంలో హైస్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ సేఫ్టీ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని కామెంట్స్‌ చేశారు. 

కాగా, ఖమ్మం జిల్లాలోని మధిరలో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ మంత్రుల ఆరోపించడం హస్యాస్పదంగా ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలంతా చూస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీపై 15-20 పిల్లర్లు కుంగిపోయాయి. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాస్తవాలను బయటకు రానివ్వడం లేదు. మేడిగడ్డపై కాంగ్రెస్‌ నేతలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఎంతో గొప్పగా నిర్మించామంటూ బీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పుకుంది.  

మున్ముందు ముప్పు తప్పదు..
మున్ముందు కూడా బ్యారేజీతో ముప్పు ఉందని కేంద్ర బృందం చెప్పింది. మొత్తం బ్యారేజీ పనిచేయని స్థితికి వచ్చింది. ఏడో బ్లాక్‌ రిపేరు చేయడానికి వీలుగా లేదని నేషనల్‌ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ చెప్పింది. మొత్తం బ్లాక్‌ని పునాదులతో సహా తొలగించి పునర్‌నిర్మించాలని సూచించింది. సమస్య పరిష్కరించేంత వరకు బ్యారేజీని ఉపయోగించే పరిస్థితి కూడా లేదని కేంద్ర బృందం తెలిపింది. ఒక వేళ ఉపయోగిస్తే మొత్తం బ్యారేజీని మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి రావొచ్చని బృందం చెప్పింది. 

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. ఈసారి అధికారంలోకి రామని సీఎం కేసీఆర్‌కి అర్థమైపోయింది. రోజురోజుకి మా గ్రాఫ్ పెరుగుతోంది. మొన్నటి వరకు 80లోపు సీట్లు వస్తాయనుకున్నాం.. ప్రస్తుతం జనం నుంచి వస్తున్న స్పందన చుస్తే 80 సీట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు గంటల కరెంటు ఇస్తారని, రైతుబంధు రాదని కేసీఆర్ జనాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మా ఆరు గ్యారెంటీ స్కీమ్‌లు జనంలోకి బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ వస్తే గ్యారెంటీ స్కీమ్‌లు అమలవుతాయని జనం నమ్ముతున్నారు. సీపీఐ పార్టీతో పొత్తుల విషయంపై కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి:  లిక్కర్‌ స్కాంలో కవితపై కేంద్రమంత్రి ఠాకూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

మరిన్ని వార్తలు