మహమూద్‌ అలీ అనే నేను..

14 Dec, 2018 09:42 IST|Sakshi
ప్రమాణ స్వీకారోత్సవంలో సీఎం కేసీఆర్‌ను ఆలింగనం చేసుకుంటున్న మంత్రి మహమూద్‌ అలీ. చిత్రంలో గవర్నర్‌ నరసింహన్‌

సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రిగా ప్రమాణం

పార్టీ ఆవిర్భావం నుంచి ఆయనతోనే పయనం

సాక్షి,సిటీబ్యూరో: మహమూద్‌ అలీ.. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూశాఖ మంత్రిగా సేవలందించారు. అంతకుమించి సీఎం కేసీఆర్‌కు ఆత్మీయుడు. కష్టాలు, నష్టాల్లోనూ నమ్మిన నేత వెంటే అలీ పయనించారు. కేసీఆర్‌ అంటే ఆయనకు అమితమైన అభివానం, గౌరవం. కేసీఆర్‌కు సైతం మహమూద్‌ అలీ అంటే ఎంతో ఇష్టం. అందుకే గురువారం తనతో పాటు మంత్రిగా మహమూద్‌ అలీని ఎంచుకున్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంలోనే పార్టీలో చేరిన అలీ.. పార్టీ సిటీ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర మైనారిటీ సెల్‌ చైర్మన్‌గా సేవలందించారు. ఆపై 2002లో ఆజంపురా కార్పొరేటర్‌గా, 2009లో సికింద్రాబాద్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు.

అనంతరం శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై కేసీఆర్‌ కేబినెట్‌లో రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అలీ సారథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ వంటివి దిగ్విజయంగా చేపట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పాల వ్యాపారంలో ఉన్న మహమూద్‌ అలీ, ఆజంపురాలోని తన నివాసంలో 2001 నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ కోసమే ఒక ప్రత్యేక కుర్చీని వేయించారు. అక్కడ ఎన్ని పార్టీ సమావేశాలు జరిగినా.. ఎంతటి ప్రముఖులు వచ్చినా ఆ కుర్చీలో ఇప్పటి దాకా కేసీఆర్‌ తప్ప మరెవరినీ ఆసీనులు కాకుండా చూడటం విశేషం. తన అభిమాన నేత అక్కడే ఉన్నట్టుగా అలీ భావించడం ప్రత్యేకమైన అంశం.  

నమ్మకాన్ని వమ్ము చేయను: అలీ  
అత్యంత విశ్వాసంతో సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర నూతన మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్‌ అలీ స్పష్టం చేశారు. గురువారం తనను అభినందించేందుకు భారీగా వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలను మరింత విస్తృతం చేసే ప్రక్రియలో తనకు భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు