‘రాష్ట్రం జ్వరాలమయంగా మారింది’

3 Sep, 2019 16:54 IST|Sakshi

సాక్షి, ములుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు.  మంగళవారం ఆయన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ములుగు ఏరియా ఆస్పత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించిందని కానీ, అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి అంటే 250 పడకలు ఉండాలి. అయితే ఇక్కడ కేవలం వంద పడకలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాక మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మాత్రం ములుగు ఆస్పత్రి 50 పడకల ఆస్పత్రి మాత్రమే అని, ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నారని ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి మీడియాకు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖకు, డ్రగ్ కంట్రోల్ శాఖకు మధ్య సమన్వయం లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.రాష్ట్రం జ్వరాలమయంగా మారిందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో పరిపాలన లేదు అని చెప్పడానికి ఇంతకంటే మించి ఇంకేమి కావాలి అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన ఈ ఆస్పత్రికి రాష్ట్రం ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

వసతులు ఎక్కడ?
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరేళ్లలో ఇప్పటివరకు కూడా కనీసం ఎక్విప్మెంట్లు సమకూర్చలేదని ఎద్దేవా చేశారు. ఎంఆర్ఐ, ఈసీజీలతో పాటు బ్లడ్ సేపరేటర్, డయాలసిస్ సెంటర్ సౌకర‍్యం కూడా లేదని మండిపడ్డారు.

 డాక్టర్లు ఎక్కడ?
ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పదిమంది సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరని ప్రశ్నించారు. అలాగే ఏడుగురు డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు కూడా లేరన్నారు. అంతేకాక సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 27 మంది ఉండాల్సి ఉండగా.. 11 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఈ సందర్బంగా భట్టీ పేర్కొన్నారు. నర్సింగ్ విభాగానికి వస్తే.. గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు రెండు ఉండగా.. రెండూ ఖాళీగానే ఉన్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సు పోస్టులు 25 ఉండగా, అందులో 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భట్టి మీడియాకు వివరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా