విధేయతే నా బలం.. సీఎల్పీ నేత భట్టి

20 Nov, 2023 08:01 IST|Sakshi

ప్రజాభిమానమే నా బలగం 

పార్టీకి సంస్థాగత వారసుడిని..  

నాకు ప్రాధాన్యంఇవ్వడంలో తప్పేముంటుంది 

తెలంగాణకు కేసీఆరే ప్రధాన శత్రువు 

బీఆర్‌ఎస్‌కు ఇక్కడ ఓటేస్తే ఢిల్లీలో బీజేపీకి వేసినట్టే 

బీఆర్‌ఎస్‌ చెబుతున్నందుకే బీజేపీ మా పార్టీ  నాయకులపై ఐటీ దాడులు చేయిస్తోంది

రాష్ట్ర సంపదను ప్రజలకు పంపిణీ చేయాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని,  ఆ ఆలోచనతో ముందుకెళుతున్నామని అంటున్నారు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడు మల్లు భట్టి విక్రమార్క.  తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు బీఆర్‌ఎస్‌ ఓడిపోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారాయన.

మధిర నియోజకవర్గంలోని బోనకల్‌ మండలం సీతానగరం, పెదబీరవెల్లి, చినబీరవెల్లి, నారాయణపురం, జానకీపురం, రావినూతల గ్రామాల్లో ఆయన ఆదివారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న తీరు, కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వ్యూహం, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంల వైఖరి, అభివృద్ధి ప్రణాళికలతో పాటు తనకు ముఖ్యమంత్రి  పదవి దక్కే అవకాశాలపై ఈ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే.! 

ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలెందుకు గెలిపించాలి? 
రాష్ట్ర సంపదను ప్రజలకు పంపిణీ చేయాలన్నదే కాంగ్రెస్‌ ఆలోచన. పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయం, సేవా రంగాల అభి వృద్ధి ద్వారా  సంపదను సృష్టించి దానిని ఎలా పంచుతామో ఇప్పటికే ప్రజలకు చెప్పాం. ఇంటింటికీ మా గ్యారంటీ కార్డులు పంపిణీ చేశాం. ఆత్మగౌరవం, సంపద పంపిణీనే ఈ ఎన్నికల్లో ప్రచారా్రస్తాలు. ప్రజలు మా వాదనను అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈసారి గెలిపించాలనే నిర్ణయానికి వచ్చారు 80కి పైగా స్థానాల్లో విజయం సాధించి ఈసారి అధికారంలోకి వస్తాం.  

బీఆర్‌ఎస్, బీజేపీల గురించి ఏం చెప్తారు? 
ఆ రెండు పార్టీలు ఒక్కటే. బీఆర్‌ఎస్‌కు ఇక్కడ ఓటేయడమంటే నేరుగా ఢిల్లీలో బీజేపీకి ఓటేసినట్టే. ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్‌ బీజేపీకి ఓటేస్తుంది. బీఆర్‌ఎస్‌–బీజేపీల బంధం గురించి కొత్తగా మేం చెపాల్సింది ఏమీ లేదు. గత పదేళ్ల చరిత్ర చెపుతోంది అదే.  

తెలంగాణకు కాంగ్రెస్సే ప్రధాన శత్రువు అని కేసీఆర్‌ అంటున్నారు కదా? 
తెలంగాణ ప్రజల ప్రధాన శత్రువు కేసీఆర్‌. అడుగడుగునా దోపిడీలు, అక్రమాలు చేస్తూ రాష్ట్రంలో ఫ్యూడల్‌ వ్యవస్థను పునర్ని­ర్మించేందుకు ఆయన తపనపడుతున్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్‌ పూర్తి­గా నిర్విర్యం చేశారు. బాంచన్‌ దొర బతుకుల కోసమే కేసీఆర్‌ ప్రయత్నం. 

ఎంఐఎం మిమ్మల్ని బాగా టార్గెట్‌ చేస్తున్నట్టుంది?  
బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతిస్తే బీఆర్‌ఎస్‌ బీజేపీకి సహకరిస్తుంది. బీఆర్‌ఎస్‌ టూ బీజేపీ వయా ఎంఐఎం అన్నట్టుగా ఈ మూడు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. నిజమైన లౌకిక వాద పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేది మేమే. రాష్ట్రంలోని మైనార్టీలందరూ ఆలోచించాలి. కాంగ్రెస్‌కు మద్దతివ్వడం ద్వారా లౌకికవాద మనుగడకు వారంతా చేయూతనందించాలి.  

మీ పార్టీ నేతలపై ఐటీ దాడుల గురించి ఏమంటారు? 
బీఆర్‌ఎస్‌ చెపుతుంటే బీజేపీ మా నాయకులపై ఐటీ దాడులు చేస్తోంది. ఈ రెండు పార్టీలు ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు. ప్రతిపక్షాలను లొంగదీసుకుని, బీజేపీ ఇచ్చిన శక్తిని కూడగట్టుకుని రాష్ట్రంలో మనుగడ సాగించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది.  

బీసీల గురించి రాహుల్‌గాంధీ కూడా పదేపదే మాట్లాడుతున్నారు? 
దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతుందని ఇప్పటికే మా నాయకుడు రాహుల్‌గాంధీ చెపుతున్నారు. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల సమున్నతి కోసం మేం కట్టుబడి ఉన్నాం. అందుకే బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేస్తామని మేం మేనిఫెస్టోలో చెబితే, బీసీల జనగణన దేశమంతా చేస్తామని రాహుల్‌గాంధీ చెబుతున్నారు. నేను పాదయాత్రలో ఉన్నప్పుడే సీఎంకు బీసీ సబ్‌ప్లాన్‌పై లేఖ రాశా. బీసీలకు గౌరవమిచ్చేది కాంగ్రెస్‌ పార్టీనేనని తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు.  

పాదయాత్ర అనుభవాలు ఎన్నికల్లో ఉపయోగపడుతున్నాయా? 
నా పాదయాత్ర ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పాదయాత్ర ద్వారా కాంగ్రెస్‌ పార్టీని ప్రజల మధ్యకు తెచ్చా. నా పాదయాత్ర సందర్భంగానే మంచిర్యాల,జడ్చర్ల, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో భారీ బహిరంగసభలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని చెప్పడమే కాకుండా మా పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపగలిగాం. పాదయాత్ర సందర్భంగా ప్రజలు వివరించిన సమస్యలకు మా మేనిఫెస్టోలో స్థానం కల్పించాం. వాటికి పరిష్కారం చూపెడతాం.  

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారని అనుకుంటున్నారా.? 
నేను కాంగ్రెస్‌ మనిషిని. పార్టీకి విధేయుడిని. నా విధేయతే నాకు పెద్ద బలం. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌కాంగ్రెస్‌ నుంచి వచ్చి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, ప్రచార కమిటీ చైర్మన్‌గా పనిచేశా. అసెంబ్లీలో చీఫ్‌ విప్, డిప్యూటీ స్పీకర్‌ హోదాల్లో పాలనానుభవం సంపాదించా.

సీఎల్పీ నాయకుడిగా రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్ర­భు­త్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజల అభిమానం చూరగొన్నా. వారి అభిమానమే నాకు బలగం. పార్టీకి సంస్థాగత వారసుడిని. నాకు ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పేముంటుంది. రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన పదవి విషయంలో పార్టీ అ«ధిష్టానం కూడా అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు శిరోధార్యమే.  

జలగం వెంగళరావు లాంటి హోదా వస్తుందని అందుకే అన్నారా? 
తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లాకు ప్రత్యేకత ఉంది. అనేక భావజాలాలు, ఆలోచనలు, పరిణతి చెందిన రాజకీయాలకు ఖమ్మం పెట్టింది పేరు. చాలా చైతన్యవంతమైన జిల్లా ఇది. మా జిల్లాకు చెందిన జలగం వెంగళరావు సీఎల్పీ నాయకుడిగా పనిచేశారు. నేను కూడా సీఎల్పీ నాయకుడిగా చేశా. మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే ఆయన లాంటి హోదా వచ్చే అవకాశం ఉందని నా నియోజకవర్గం, జిల్లా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. అందుకే అలా చెప్పా. 

మీ ప్రచార సభల్లో సీఎం.. సీఎం అనే నినాదాలు వినిపిస్తున్నాయి? 
అది వారి మనసులో ఉన్న కోరిక కావొచ్చు. కాంగ్రెస్‌ పార్టీలో ముఖ్యమంత్రి కావాలంటే ముందు పార్టీ శాసనసభాపక్షం (సీఎల్పీ) నాయకుడిగా ఎన్నికవ్వాలి. ఇప్పటికే నేను సీఎల్పీ నాయకుడిగా ఉన్నాను కాబట్టి నా నియోజకవర్గ ప్రజలు ఆశతో ఉన్నారేమో. అందుకే అలాంటి నినాదాలు మీకు వినిపించి ఉంటాయి. పదవుల సంగతి ఎలా ఉన్నా పార్టీని గెలిపించేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకత్వం కలిసికట్టుగా పనిచేస్తోంది.  

-మేకల కళ్యాణ్‌ చక్రవర్తి 

మరిన్ని వార్తలు