సెల్ టవర్ ఎక్కిన ప్రేమికుడు..

28 May, 2015 10:51 IST|Sakshi

వరంగల్: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ ఒక యువకుడు సెల్‌టవర్ ఎక్కాడు. పెళ్లికి ఓకే అంటేనే దిగుతానని లేకుంటే కిందికి దూకుతానని షరతు పెట్టాడు. వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పరకాల మండలం జూకల్లు గ్రామానికి చెందిన ఎడమాండ్ల నాగరాజు(29) గతంలో హన్మకొండలోని ఓ ప్రైవేట్ కళాశాల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అదే కళాశాలలో చదివే విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు.

అయితే, కులాలు వేరు కావటంతో యువతి తల్లిదండ్రులు వారి పెళ్లికి అభ్యంతరం తెలిపారు. మరో రెండు రోజుల్లో యువతికి మరో యువకుడితో నిశ్చితార్ధం జరుప తలపెట్టారు. దీంతో నాగరాజు నాలుగు రోజుల క్రితం స్థానిక మిల్స్‌కాలనీ పోలీసులను సైతం ఆశ్రయించాడు. ఫలితం లేకపోవటంతో గురువారం ఉదయం 5 గంటల సమయంలో కరీమాబాద్ పట్టణం కుర్మవాడలో ఉన్న సెల్ టవర్‌పైకి ఎక్కాడు. ప్రేమించిన యువతితో పెళ్లి జరిపిస్తామంటేనే దిగుతానని, లేదంటే టవర్ పైనుంచి దూకుతానని బెదిరిస్తున్నాడు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు