మిరాకిల్‌.. చావు నోట్లోకెళ్లి బయటపడ్డాడు!

27 Aug, 2019 15:28 IST|Sakshi
రైలు కింద నుంచి బాధితుడిని బయటకు తీస్తున్న దృశ్యం

సాక్షి, రామగుండం: నిజంగా ఈ కీమెన్‌ మృత్యువును జయించాడు. గూడ్సు రైలు వస్తుందని ఒక రైల్వే ట్రాక్‌పై నుంచి మరో ట్రాక్‌పైకి వెళ్లడం.. అంతలోనే అటువైపు నుంచి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అతనిపైకి దూసుకురావడం.. క్షణాల్లో అతను రైలు ఇంజన్‌ కిందికి దూరిపోవడం.. అయ్యో.. నుజ్జునుజ్జయి ఉంటాడని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారంతా ఆందోళన చెందడం.. ఇంతలోనే చావు నోట్లోకెళ్లి ప్రాణాలతో బయటపడటం.. ఇదంతా చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది కదూ.. ఔను, ఈ కీమెన్‌ మృత్యు కోరల్లోకెళ్లి ప్రాణ గండం నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌ సమీపంలోని కుందనపల్లి రైల్వేగేటు వద్ద చోటుచేసుకుంది. కుందనపల్లి రైల్వేగేటు వద్ద కీమెన్‌ కత్తుల దుర్గయ్యతో రైల్వే ట్రాక్‌ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యాడు. మూడు రైల్వే ట్రాకుల్లో ఒక ట్రాక్‌పై పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా గూడ్సు రైలు వస్తుండటంతో మరో ట్రాక్‌ మీదకు కార్మికులు చేరుకున్నారు. అప్పటికే అతి దగ్గరలో ఉన్న రాజధాని సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ క్షణాల్లో కీమెన్‌ దుర్గయ్యపై దూసుకొచ్చింది. అప్రమత్తమైన ఆయన ఇంజిన్‌ కిందకు దూరిపోయాడు. రెండు బోగీలు అతని పైనుంచి వెళ్లాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు భయాందోళన చెందారు. రైలు కో పైలెట్‌ చాకచక్యంగా వ్యవహరించాడు. సడెన్‌ బ్రేక్‌ వేసి రైలును కొద్ది దూరంలో నిలిపివేశాడు.

అప్పటికే కీమెన్‌ పైనుంచి రెండు బోగీలు వెళ్లడంతో బాధితుడు నుజ్జునుజ్జు అయి ఉంటాడని అందరూ భావించారు. కానీ దుర్గయ్య పట్టాల మధ్యలో ప్రాణాలు బిగపట్టుకొని పడుకుని ఉన్నాడు. ఎడమ కాలి ఎముక విరిగి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతడిని రైలు కింద నుంచి బయటకు లాగి హుటాహుటిన స్థానిక రైల్వే ఆస్పత్రికి తరలించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు