ఆదివాసీల పోరుకు మావోయిస్టు పార్టీ మద్దతు

22 Dec, 2017 03:08 IST|Sakshi

పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఎస్టీల్లోంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీలు చేస్తున్న ఆందోళనకు మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించింది. అవసరమైతే ఇంద్రవెల్లి.. మరో జగిత్యాల జైత్రయాత్రలాగా మారి జల్‌ జంగిల్, జమీన్‌ కోసం ఉద్యమించేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడీలను ఎస్టీల్లో చేర్చి ఓట్లు పొందేందుకు 1976లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు.

లంబాడీలు మహారాష్ట్ర లో బీసీలుగా, రాజస్తాన్‌లో ఓసీలుగా పరిగణించబడుతున్నారన్నారు. గత పాలకులతోపాటు సీఎం కేసీఆర్‌ లంబాడీలకు పెద్దపీట వేస్తూ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీం విగ్రహం(జోడేఘాట్‌) పక్కన లంబాడీల సూంకీమాత విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్టించడమే ఘర్షణకు ప్రధాన కారణమని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఆదివాసీలైన కోయ, గొత్తికోయలు, కోయ కమ్మరి, చెంచు, గోండు, కోలామ్, నాయక్‌పోడ్, ధోయిటీ, పరధానులు సూం కీమాత విగ్రహాన్ని ధ్వంసం చేసి తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారని వెల్లడించారు.

ఆదివాసీలకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం వారిని మావోయిస్టుల ని ముద్రవేసి బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపుతోందని ఆరోపించారు. నీటి పారుదల ప్రాజెక్టులు, గనులు, ఓపెన్‌కాస్ట్‌ పేరుతో ఆదివాసీలను సమాధి చేసి ఘర్షణ వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నదని విమర్శించారు. ఆదివాసీల అనాగరికతను ఆసరా చేసుకొని ఎస్టీ రిజర్వేషన్‌ పేరుతో 90 శాతం ఉద్యోగాలు, సౌకర్యాలను లంబాడీలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ లుగా వర్గీకరించాలని, లేకపోతే ఆదివాసీల తరఫున మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని నడుపుతుందని వెల్లడించారు. లంబాడీలు సైతం ఆదివాసీలకు న్యాయం జరిగేలా వర్గీకరణ కోసం పోరాడాలని, ఘర్షణలు మానుకొని ఐక్యంగా ఉండాలని జగన్‌ కోరారు.   

మరిన్ని వార్తలు