వేదమంత్రాల సాక్షిగా.. ఒక్కటైన 165 జంటలు

2 Dec, 2019 09:13 IST|Sakshi
జిలకర బెల్లం పెట్టుకుంటున్న వధూవరులు

కనులపండువగా సామూహిక వివాహాలు

వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

వేదికపైనే కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత 

ఆకట్టుకున్న సంగీత విభావరి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: వేదమంత్రాల సాక్షిగా ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. ఎంజేఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు పి.రాములు, కొత్త ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, భీరం హర్షవర్ధ్దన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్, ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బాద్మీశివకుమార్, జెడ్పీ ఛైర్మన్‌  పెద్దపల్లి పద్మావతి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, జేసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శులు జక్కా రఘునందన్‌రెడ్డి, బైకాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ లోక కల్యాణం కోసం 165 జంటల వివాహాలు జరిపిస్తున్నట్లు భావిస్తున్నానన్నారు.

సామూహిక వివాహాలు ఒకే రోజులో సాధారణంగా కాకుండా  పారిశ్రామిక వేత్తలు, ధనవంతుల పెళ్లిళ్లు చేసినట్లుగా అంగరంగవైభవంగా నాలుగురోజుల పాటు పేదల వివాహాలు జరిపించడం గొప్ప విషయమన్నారు. బతుకునిచ్చిన సమాజానికి, పేదలకు ఎంతో కొంత చేయాలన్న సంకల్పంతో మర్రి జనార్దన్‌రెడ్డి సేవలు చేయడం సంతోషకరమన్నారు. అనంతరం ఎంజేఆర్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మానవసేవే మాదవసేవ అనే కోణంలో పుట్టిందే ఎంజేఆర్‌ ట్రస్ట్‌ అని అన్నారు. పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి 165 జంటలకు పెళ్లి రోజునే కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ఎంజేఆర్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌రెడ్డి, గాయకుడు సాయిచంద్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత విభావరి, డిజిటల్‌ వీడియోగ్రఫి, కోలాటం తదితర కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అలాగే నూతన వధూవరులకు కనీస అవసరాలైన వస్తు సామగ్రిని కూడా అందజేశారు. ఈ వివాహాలకు జిల్లా వ్యాప్తంగా 20వేల మందికిపైగా ప్రజలు తరలివచ్చారు.  

మరిన్ని వార్తలు