ఏసీబీ విచారణకు మత్తయ్య డుమ్మా

21 Feb, 2016 03:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో కొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపి రేవంత్‌రెడ్డి తోపాటు పలువురు టీడీపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య అంశం మరో మలుపు తిరిగింది. కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) ఫిబ్రవరి 12న 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఏసీబీ ఇచ్చిన 8 రోజుల గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే మత్తయ్య తనకు ఆరోగ్యం బాగోలేదంటూ శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.

తాను హై బీపీ కారణంగా ఏపీ గుంటూరు జిల్లా నరసారావుపేటలోని మధర్ థెరిస్సా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, ఆ తర్వాత విచారణకు హాజరవుతానన్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏసీబీ అతన్ని అరెస్టు చేయమని స్పష్టం చేసినా, విచారణకు హాజరుకాకుండా వ్యవహరిస్తున్న తీరును న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని యోచిస్తోంది. అయితే మరోవైపు మత్తయ్య మాత్రం ఏసీబీ తనకు నోటీసులు జారీ చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందంటున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 15న హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు