అవినీతిలో 'సహకారం'!

7 Sep, 2019 10:41 IST|Sakshi

సహకార శాఖలో స్వాహాపర్వం

పర్సన్‌ ఇన్‌చార్జిలతో ఓ అధికారి కుమ్మక్కు

సర్క్యులర్‌ను పక్కనబెట్టి యథేచ్ఛగా దోపిడీ

పర్సంటేజీల మేరకు అనుమతులు

సాక్షి, మెదక్‌: జిల్లా సహకార శాఖలో కాసులకు కక్కుర్తి పడిన ఓ అధికారి అక్రమార్కుల అవినీతికి ‘సహకారం’ అందిస్తూ అండగా నిలుస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ను బుట్టదాఖలు చేస్తూ దోపిడీ పర్వానికి తెరలేపారు. పర్సన్‌ ఇన్‌చార్జిలతో కుమ్మక్కై పర్సంటేజీల ప్రకారం నిధుల విడుదలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.

రైతులకు రుణాలందించి చేయూతనివ్వడం.. ధాన్యం, ఇతర పంటల కొనుగోలు, ఎరువులు పంపిణీ చేయడం వంటి కార్యకలాపాల నిర్వహణతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార శాఖ లక్ష్యం. ఈ మేరకు పీఏసీఎస్‌ల డైరెక్టర్లు, చైర్మన్లు, అధికారులు కృషి చేయాలి. అయితే.. పలువురి స్వలాభాపేక్షతో ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కుల హవా నడుస్తోంది. పీఏసీఎస్‌ పాలకవర్గాల పొడిగింపు సాకుతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.

పీఏసీఎస్‌ నిధుల విడుదల
పాపన్నపేట  రూ.5.50 లక్షలు
కొత్తపల్లి రూ.1.16 లక్షలు
జంగరాయి రూ.50 వేలు

పర్సన్‌ ఇన్‌చార్జిలతో కుమ్మక్కు ?
జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా వీటికి ఎన్నికలు జరిగి పాలక వర్గాలు కొలువుదీరాయి. ఈ పాలకవర్గాల పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసినప్పటికీ.. అనేక అవాంతరాలు చోటుచేసుకోగా ఎన్నికలు జరగలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీ కాలం పొడిగిస్తూ వస్తోంది. 2018 నుంచి మూడు పర్యాయాలు పదవీ కాలం పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా పీఏసీఎస్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమించక తప్పని పరిస్థితి సహకార శాఖలో నెలకొంది. దీన్నే ఆసరాగా చేసుకుని ఓ అధికారి అక్రమాలకు తెరలేపాడు. తాను నియమించిన పర్సన్‌ ఇన్‌చార్జిలతో కుమ్మక్కై దోపిడీ దందాకు తెగబడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్క్యులర్‌ పట్టించుకోకుండా..
పీఏసీఎస్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జిల నియామకాల్లోనే నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాలు తీసుకుని చెల్లించకుండా బకాయి ఉన్న వారికి సైతం పర్సన్‌ ఇన్‌చార్జిలుగా అవకాశం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు సమయంలో నిధుల కేటాయింపు, మంజూరు, విడుదలకు సంబంధించి సహకార శాఖ కమిషనర్‌ 2018 జనవరిలో ఓ సర్క్యులర్‌ను జారీచేశారు. పర్సన్‌ ఇన్‌చార్జిల హయాం లో అవకతవకలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తగా పెద్దఎత్తున నిధులు విడుదల చేయొద్దని అందులో స్పష్టంగా ఉంది. దీన్ని అధికారు లు పట్టించుకోకుండా వివిధ పనులు, ఖర్చుల పేరిట పర్సన్‌ ఇన్‌చార్జిలు నిధులు మంజూరు చేయాలని దరఖాస్తు పెట్టుకోవడంతో నిధుల విడుదల చకచకా జరిగిపోతుంది. 

పర్సంటేజీల కక్కుర్తితోనేనా..
ఎలాంటి రికార్డులు లేకుండానే అధికారులు పీఏసీఎస్‌లకు అక్రమంగా నిధులు మంజూరు చేసినట్లు ఆ శాఖలో ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. పర్సన్‌ ఇన్‌చార్జిలతో ఓ అధికారి కుమ్మక్కై దందా నడిపిస్తున్నట్లు సమాచారం. రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షలకు.. ఇలా విడుదల చేసే మొత్తానికి 4 నుంచి 20 శాతం మేర పర్సంటేజీల రూపంలో ముందస్తుగా వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు అభివృద్ధి పనుల పేరిట విడుదలైన నిధులకు సంబంధించిన పనుల్లో సైతం భారీగా అవినీతి చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టెండర్లు పిలవకుండానే తూతూమంత్రంగా పనులు చేపట్టి.. భారీగా నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

కొన్ని ఉదాహరణలు..
జిల్లాలో దాదాపుగా 80 శాతం పీఏసీఎస్‌లలో నిధులు దుర్వినియోగమైనట్లు సమాచారం. ప్రత్యేక మరమ్మతులకు (స్పెషల్‌ రిపేర్స్‌) నిధులు మంజూరు చేయాలని పాపన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి ఈ ఏడాది జూలై 15వ తేదీన సహకారశాఖకు అర్జీ పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి మేనేజింగ్‌ కమిటీ ఆమోదం తెలిపిందని.. సర్వసభ్య సమావేశం ఈ ఏడాది మార్చి 27న నిర్వహించినట్లు అందులో పేర్కొన్నారు.

దీనికి సంబంధించి ఈ ఏడాది జూలై 18న నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ పడింది. ఈ క్రమంలో సహకార శాఖ కమిషనర్‌ సర్క్యులర్‌లోని నిబంధనలు అతిక్రమించి నిధులు విడుదల చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా కొత్తపల్లి పీఏసీఎస్‌కు సంబంధించి టాయిలెట్లు, సైడ్‌ వాల్స్‌ నిర్మాణానికి రూ.1.16 లక్షలు, జంగరాయి పీఏసీఎస్‌ కాంపౌండ్‌వాల్‌ నిర్మాణానికి రూ.50 వేలు విడుదల చేశారు. 

నిబంధనల ప్రకారమే..
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నిబంధనల ప్రకారమే నిధుల విడుదల జరుగుతోంది. గతంలో ఆమోదం పొంది, పెండింగ్‌లో ఉన్న వాటిని మాత్రమే విడుదల చేస్తున్నాం. కొత్తగా నిధుల విడుదలకు ఎలాంటి మంజూరు ఇవ్వడం లేదు. 
– ఈశ్వరయ్య, జిల్లా సహకార అధికారి 

>
మరిన్ని వార్తలు