తెరవెనుక బాస్

3 Feb, 2015 04:37 IST|Sakshi
తెరవెనుక బాస్

మెప్మాలో అవినీతికి ఓ కాంట్రాక్టు ఉద్యోగి సూత్రధారి
 బాస్ అండతో రూ.కోట్లు స్వాహాకు ప్రణాళిక
 వ్యవహారంపై కార్పొరేషన్‌లో ఇంటెలిజెన్స్ ఆరా
ఇంత జరుగుతున్నా సిబ్బందిని వెనకేసుకొస్తున్న అధికారి

 సాక్షి, ఖమ్మం: ‘కంచే చేను మేసిన’ చందంగా మెప్మాలో అవినీతికి ఆ కార్యాలయ బాస్ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘దోచుకున్నోడికి దొచుకున్నంత మహదేవ’ అన్నట్టు ఆ కార్యాలయ అధికారి కళ్లుమూసుకోవడంతో సిబ్బంది అందినకాడికి దండుకున్నారు. రూ.కోట్ల లింకేజి రుణాలను ఓ ప్రణాళిక ప్రకారం భుజించేశారు. బినామీ గ్రూపుల ఏర్పాటు మొదలు.. సిబ్బంది తమ వాటా కమీషన్‌ను పుచ్చుకోవడంలో కార్యాలయంలోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి అంతాతానై నడిపించినట్లు సమాచారం.
 
నిన్నటి వరకు కార్పొరేషన్‌లో హల్‌చల్ చేసిన మెప్మాలోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి బయట పడిన బినామీ గ్రూపుల లింకేజి రుణం స్వాహాలో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు మెప్మా ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. సంస్థ బాస్ ఆ ఉద్యోగి మాటను కాదనకపోవడంతో మెప్మా కార్యకలపాలు కొంతకాలంగా అస్తవ్యస్తంగా మారాయి. ఇన్నాళ్లు రూ.కోట్లలో జరిగిన అవినీతి ఇప్పుడు ఒక్కసారిగా బయటపడడంతో అసలు ఎప్పటి నుంచి ఇది జరుగుతోందనే మెప్మా సంఘాల్లో చర్చనీయాంశంగా మారింది.

2013 నుంచే అవినీతికి బీజం పడినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. మెప్మాలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బాస్‌కు ఇదంతా తెలియదా..? పలుమార్లు సంస్థలోని కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు అందినా ఏం చేశారు..? అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ఆ బాస్ వ్యవహార శైలిపై అనుమానాలు వస్తున్నాయి. సదరు కాంట్రాక్టు ఉద్యోగి కనుసన్నల్లోనే బినామీ గ్రూపులు పురుడుపోసుకున్నాయని.. ఇందుకు సంస్థ బాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లింకేజి రుణం స్వాహాపర్వానికి అడ్డులేకుండా పోయిందని ఆరోపణలున్నాయి. తాజాగా సోమవారం ఎస్‌బీహెచ్ పరిధిలోని మరో మూడు బినామీ గ్రూపులు రూ.8 లక్షలు స్వాహా చేసినట్లు బయటపడింది. ఈ అవినీతి బాగోతం సంగతి తేల్చేందుకు మెప్మా ఉన్నతాధికారులు ఖమ్మం వచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం.
 
ఇన్‌చార్జి పాలనలో మెప్మా..?
మెప్మా ఏర్పాటు అయినప్పటి నుంచి జిల్లాలో ఇన్‌చార్జి అధికారి పాలనలోనే కొనసాగుతోంది. 2008 నుంచి ఇప్పటి వరకు ఒకే అధికారి విధులు నిర్వహిస్తుండటంతో అవినీతి ఊడలైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏ ప్రభుత్వ అధికారినైనా మూడు లేదా నాలుగేళ్లలో కచ్చితంగా బదిలీ చేస్తారు. కానీ ప్రస్తుత అధికారి ఎనిమిదేళ్లుగా ఒకే సంస్థకు ఇన్‌చార్జిగా ఉన్నారు. కాబట్టే మెప్మా కార్యకలాపాలు గాడితప్పాయని విమర్శలున్నాయి. మెప్మాకు పూర్తి స్థాయి అధికారిని నియమించి సమగ్ర విచారణ చేయిస్తేనే లింకేజి రుణం స్వాహా పర్వం కొలిక్కిరానుంది.
 
జిల్లా అధికారులకు బురిడీ..
సదరు బాస్ మాత్రం ..‘లేనిది ఉన్నట్లు’గా అభూత కల్పనలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అవి వాస్తవం కాదని జిల్లా అధికారులను బురిడీ కొట్టించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఏకంగా బ్యాంకులే బినామీ గ్రూపులను డిఫాల్టర్స్‌గా తేల్చడం.. ఈ రుణం నొక్కేసిన వారు తామే చెల్లిస్తామని మరో వైపు ప్రాంసరీ నోట్లతో సెటిల్‌మెంట్లకు దిగినా దీనితో తనకేమి సంబంధం లేనట్లుగా ఆయన వ్యవహరిస్తుండటం గమనార్హం. మెప్మాలో ఏళ్లుగా పనిచేస్తున్న సదరు బాస్.. లింకేజి రుణం స్వాహా తమ సంస్థకు సంబంధం లేదని, అంతా బ్యాంకు అధికారులే తేల్చాలని తమ సిబ్బందిని వెనకేసుకొస్తుండడం గమనార్హం.

కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి మెప్మాలో అంతా తానైనట్లు వ్యవహరిస్తున్న ఓ ఉద్యోగి జిల్లా కార్యాలయ ఉద్యోగులను శాసిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా కార్యాలయ కార్యనిర్వాహణ అధికారి ఉన్నా.. ఆమె సీటును ఓ మూలన పడేసి కార్యాలయానికి తానే బాస్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.కార్యాలయంలో ఏ ఉద్యోగి అయినా తన మాట వినకపోతే వారిని ఉద్యోగం నుంచి తొలగించడం ఆ ఉద్యోగికి వెన్నతో పెట్టిన విద్య. నిజానికి సదరు ఉద్యోగి మెప్మా గ్రూపులను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణ తరగతులు నిర్వహించడం.. తదితర విషయాల్లో సభ్యులకు అవగాహన కల్పించాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఉన్నతాధికారి అండతో మెప్మాకు షోడో బాస్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
 
ఇంటెలిజెన్స్ ఆరా
గతంలో షాడో కమిషనర్‌గా కార్పొరేషన్ కార్యాలయంలో మెప్మా కాంట్రాక్టు ఉద్యోగి హల్‌చల్ చేయడం.. ఇప్పుడు లింకేజి రుణం స్వాహాలో సదరు కాంట్రాక్టు ఉద్యోగి హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బృందం సోమవారం ఖమ్మం కార్పొరేషన్‌లో ఆరా తీసింది. కార్పొరేషన్‌లో ఆ ఉద్యోగి గతంలో ఏం చేశారు... ఇప్పుడు ఏం చేస్తున్నారన్న కోణంలో కార్పొరేషన్ ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు