పంద్రాగస్టుకు మెట్రో డౌటే!

6 Aug, 2018 12:20 IST|Sakshi

ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్లో రాకపోకలు మరింత ఆలస్యం

కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ కోసం నిరీక్షణ

ఈనెలాఖరుకు అందే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ సిటీజనులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్లో మెట్రో రైళ్ల రాకపోకలు  మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం పంద్రాగస్టు(ఆగస్టు 15)రోజున ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయనుకున్నప్పటికీ... రైల్వే మంత్రిత్వశాఖ నుంచి రావాల్సిన కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ వారి భద్రతా ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో జాప్యమవుతోంది. దీంతో మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో రైళ్లకు స్పీడ్, లోడ్, సేఫ్టీ, ట్రాక్షన్, సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్‌ తదితర అంశాల్లో మొత్తంగా 18 రకాల ప్రయోగ పరీక్షలను దశలవారీగా నిర్వహిస్తున్నారు.

ఈ నెలాఖరుకు భద్రతా ధ్రువీకరణ పత్రం అందుతుందని మెట్రో వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ ధ్రువీకరణ అందిన తర్వాతే మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మెట్రో పట్టాలెక్కిన పక్షంలో నిత్యం సుమారు 2 లక్షలమంది ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ)మార్గంలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌(30 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా..వీటిల్లో నిత్యం 75 వేల మంది ప్రయాణిస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది నవంబరు నెల ప్రారంభంలో అమీర్‌పేట్‌–హైటెక్‌ సిటీ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హెచ్‌ఎంఆర్‌ అధికారులు చెబుతున్నారు. 

లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీకీ ఏర్పాట్లు..
మెట్రో స్టేషన్లలో దిగిన ప్రయాణికులు తిరిగి తమ గమ్యస్థానాలకుచేరుకునేందుకు వీలుగా పలు మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్‌ కార్లు, బైక్‌లు, అత్యాధునిక సైకిళ్లు, పెట్రోలు ఇంధనంగా నడిచే బైక్‌లను అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వీటికి ప్రయాణికుల ఆదరణ క్రమంగా పెరుగుతోందని..మొబైల్‌యాప్‌ ద్వారా వీటిని అద్దెకు తీసుకోవడంతోపాటు చెల్లింపులను సైతం ఆన్‌లైన్‌లో చేసే అవకాశం ఉండడంతో ప్రయాణికులు వీటిని అద్దెకు తీసుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. దశలవారీగా నగరంలోని మూడు మెట్రోకారిడార్లు...ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌నుమా, నాగోల్‌–రాయదుర్గం మార్గాల్లోని 64 మెట్రో స్టేషన్లలో అద్దె వాహనాల సదుపాయం కల్పిస్తామని..అవకాశం ఉన్నచోట ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ సదుపాయం కల్పిస్తామని హెచ్‌ఎంఆర్‌ అధికారులు తెలిపారు.

మెట్రో మార్గా ప్రారంభోత్సవాలు ఇలా..
ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌: ఆగస్టు చివరి వారం– 2018
అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ: నవంబరు– 2018

మెట్రో రెండోదశ మార్గాలివే...
మెట్రోరెండోదశ ప్రాజెక్టు సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో రెండోదశ ప్రాజెక్టుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధంచేసే బాధ్యతలను ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతానికి డీఎంఆర్‌సీ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వాని కి సమర్పించినట్లు మెట్రో అధికారులు తెలిపారు.

పాతనగరానికి మెట్రో జటిలం....
ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా(5.5 కి.మీ) మార్గంలో మెట్రో ప్రాజెక్టుకు బాలారిష్టాలు ఎదురుకానున్నా యి. ఈ మార్గంలో సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, బాధితులకు రూ.కోట్లలో పరిహారం చెల్లింపు అంశం జఠిలంగా మారనుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ మొత్తంలో పరిహారం చెల్లింపులు ప్రభుత్వం ఎలా జరుపుతుందన్న అంశంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిర్మాణ సంస్థసైతం ఇదే అం శంపై మల్లగుల్లాలు పడుతుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు