తెరపైకి ముంపు గ్రామాల ఉద్యమం

23 Aug, 2019 11:31 IST|Sakshi
గత నెల 31న నిర్వాసితుల చలో కలెక్టరేట్‌ (ఫైల్‌)

30న బహిరంగ సభకు అఖిలపక్షం సన్నాహాలు

గతనెల 31న మహా పాదయాత్రతో ఉద్యమం ఆరంభం

ముంపు సమస్యలపై సీఎం ఫోన్‌కాల్‌.. కలెక్టర్‌కు ఆదేశాలు

సాక్షి, బోయినపల్లి: శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టారు. ఇదే సమయంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆదేశాలతో ముంపు గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందనివారి నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 2006లో రాజరాజేశ్వర(మిడ్‌మానేరు)రిజర్వాయర్‌ పనులు ప్రారంభించారు. పదేళ్ల అనంతరం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు నిర్మాణంలో బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, రుద్రవరం, సంకెపెల్లి, ఆరెపెల్లి కొడుముంజ, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా, ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు ఆయా గ్రామాల్లో సర్వేచేసి 11,731 కుటుంబాలు ముంపునకు గురవుతున్నట్లు 2008–09లో గెజిట్‌ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక మెజార్టీ నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీలు అందాయని అధికారులు అంటుంటే.. చాలా మంది పరిహారం అందాల్సినవారున్నారని నిర్వాసితులు వాపోతున్నారు.

స్థానిక నేతలకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ 
ప్రాజెక్టుకు వస్తున్న నీటి ప్రవాహం గురించి సీఎం కేసీఆర్‌ ఈ నెల 16న స్థానిక నేతలతో ఫోన్‌లో మాట్లాడారు.వారు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రాని వారి సమస్యలపై సీఎంకు వివరించారు. సీఎం జిల్లా కలెక్టర్‌ను కలవాలని ఆదేశించారు.ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ తదితరులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు ప్యాకేజీలు రాని నిర్వాసితుల నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారు.

ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలకు తరలిన నిర్వాసితులకు ప్రభుత్వం 242చదరపు గజాల ఇంటి స్థలం మంజూరుచేసింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ వేములవాడలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఐక్యవేదిక,అఖిలపక్షం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌  ఫోన్‌లో మాట్లాడిన సందర్భంలో ఇళ్ల నిర్మాణాలకు రూ. 5.04 లక్షలు ఇవ్వాలనే విషయం దృష్టికి తీసుకువెళ్లినట్లు స్థానిక నేతలు తెలిపారు.ఆడిట్‌ ప్రాబ్లం అవుతుందని, మిగతా ప్రాజెక్టులకు ఇవ్వాల్సివస్తుందని సీఎం చెప్పారని అంటున్నారు.ఐక్యవేదిక నేతలు ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04లక్షలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యమానికి ఊపిర్లూదుతున్నారు.

30 భారీ బహిరంగసభ
ముంపు గ్రామాల ఐక్యవేదిక,అఖిలపక్షం ఆధ్వర్యంలో గతనెల 31న చలో కలెక్టరేట్‌ పేరిట మహాపాదయాత్ర నిర్వాహించారు. అదే ఊపుతో రాష్ట్రస్థాయిలో వివిధ పార్టీల ముఖ్య నేతలతో కలిసి ఈ నెల 30న భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభ ద్వారా ఇండ్ల నిర్మాణానికి రూ.5.04లక్షల సీఎం కేసీఆర్‌ హామీ,18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు రూ. 2 లక్షల ప్యాకేజీ, పట్టా, ఇల్లు ఉండి గ్రామంలో లేరనే నెపంతో గెజిట్‌ జాబితా నుంచి తొలగించిన వారి పేర్లు మళ్లీ గెజిట్‌ జాబితాలో చేర్చి పరిహారం, అధికారులు ఎస్టిమేట్‌ చేసిన పరిహారం రాని ఇళ్లకు పరిహారం ఇవ్వాలని, కాలనీల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని సన్నాహాలు చేస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ
నిర్వాసితులు పోరుబాట పడుతుంటే ముంపు గ్రామాల్లో ఇప్పటికీ పరిహారం రానివారి నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు రెండు రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఈ నెల 24వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు