వలసలు..!

17 Jun, 2014 02:06 IST|Sakshi
వలసలు..!


 
‘దేశం’ లక్ష్యంగా పావులు  ఎంపీపీలపై కన్నేసిన టీఆర్‌ఎస్
టీడీపీ సభ్యులు లక్ష్యంగా ఎత్తులు
అవసరమున్న చోట కాంగ్రెస్ వైపు
గుడ్‌బై చెప్పేందుకు  తమ్ముళ్లు రెడీ

 
 ‘స్థానిక’ కుర్చీలపై దృష్టిసారించిన టీఆర్‌ఎస్ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ,జెడ్పీటీసీ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఎత్తుగడలు వేస్తోంది. తమ వైపు చూసే వారికి ‘ఆకర్ష’ పద్ధతిని గూట్లోకి లాక్కొని పదవులను నిలబెట్టుకోవాలని పథక రచన చేస్తోంది. ‘పల్లె పోరులో’ పట్టు సాధించిన కమలం, సైకిల్ పక్షాల వారిని ఆకట్టుకొని మండల పరిషత్‌ల్లో పాగా వేయాలని యోచిస్తోంది.
 
మహబూబ్‌నగర్ : జిల్లా, మండల పరిషత్ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్‌ఎస్ వలసల ద్వారా కుర్చీలు దక్కించుకోవాలనే వ్యూహంతో కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారిని ఆకర్షించడం ద్వారా లక్ష్యం చేరుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ను మినహాయిస్తే జిల్లాలో టీడీపీ, బీజేపీ మాత్రమే ప్రాదేశిక ఎన్నికల్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రాదేశిక సభ్యులు, నేతలు లక్ష్యంగా చేరికల వ్యూహానికి పదును పెడుతోంది.

 త్వరలో జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పీఠం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో 64 మండల పరిషత్‌లకు గాను 20కి పైగా మండల పరిషత్‌లలో ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యా బలం దక్కలేదు. ప్రాదేశిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆసరాగా తీసుకుని అటు జిల్లా, ఇటు మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేలా వ్యూహ రచన చేస్తోంది. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కనీసం 33 మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం కాగా, టీఆర్‌ఎస్‌కు 25 మంది సభ్యులున్నారు. దీంతో తొమ్మిది మంది సభ్యుల బలమున్న టీడీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ వైపు టీడీపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఆ పార్టీ సభ్యులను పార్టీలో చేరేలా పావులు కదుపుతోంది. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేతను పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి నుంచి గెలుపొందిన ఓ టీడీపీ జడ్పీటీసీ సభ్యుడి  మద్దతు కూడగట్టుకునే యోచన కనిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని మిగతా నియోజకవర్గాల్లోనూ అనుసరించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో గెలుపొందిన నలుగురు జడ్పీటీసీ సభ్యులను మినహాయిస్తే మిగతా ఐదుగురు టీడీపీ సభ్యులను పార్టీ గొడుగుకు రప్పించే వ్యూహంతో వున్నట్లు టీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేతలను ఆకర్షించే బాధ్యతను పార్టీకి చెందిన కీలక నేతకు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

‘దేశం’ సభ్యుల పక్కచూపు

జిల్లాలో 982 మండల పరిషత్ ప్రాదేశిక  స్థానాలకు గాను కాంగ్రెస్ 367, టీఆర్‌ఎస్ 298, టీడీపీ 178, బీజేపీ 69, సీపీఐ మూడు, సీపీఎం నాలుగు, స్వతంత్రులు 63 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ సొంతంగా 28 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో సంఖ్యా పరంగా టీఆర్‌ఎస్ రెండో స్థానంలో వున్నా చాలా చోట్ల సొంత బలంపై ఆధార పడి అధ్యక్ష పదవులు దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలను ఆకర్షించడం ద్వారా మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా తయారైన పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన చోట టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇచ్చే యోచన టీడీపీ సభ్యుల్లో కనిపిస్తోంది. అధికార పార్టీకి దూరంగా వుంటే అభివృద్ధి నిధులు దక్కవనే భావన కూడా టీడీపీ ఎంపీటీసీ సభ్యుల్లో కనిపిస్తోంది. కొడంగల్, నారాయణపేట, వనపర్తి, మక్తల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకుండా పోయింది. పార్టీ పరంగా తమను పట్టించుకునే వారు కూడా లేకపోవడంతో ఇతర పార్టీల వైపు టీడీపీ శ్రేణులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. టీడీపీ పరిస్థితిని ఆసరాగా చేసుకుని జిల్లా, మండల పరిషత్ అధ్యక్ష పదవులపై టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది
 

మరిన్ని వార్తలు