ప్రతి జిల్లాకో శిల్పారామం రావాలి

22 Jun, 2019 19:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలోని ప్రతి జిల్లాకో శిల్పారామం రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆకాంక్షించారు. శనివారం ఉప్పల్‌లో ఏర్పాటైన శిల్పారామం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిల్పారామం ఉప్పల్‌ ప్రాంతంలో ఏర్పాటుకావటం ఇక్కడి ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. కళాకారులను ప్రోత్సహించడానికి శిల్పారామం ఓ మంచి వేదికగా పేర్కొన్నారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఉప్పల్‌లో శిల్పారామం ఏర్పాటైందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ఉండాలని అన్నారు.

మూసీ దుర్వాసనను పోగొట్టవచ్చు
ఉప్పల్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన శిల్పారామం పక్కన ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నామని, దాని వల్ల మూసీ నది నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టవచ్చునని మంత్రి  శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఉప్పల్‌లో ఏర్పాటైన శిల్పారామం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబంతో సహా శిల్పారామం వచ్చి సంతోషంగా గడపవచ్చునన్నారు. రూ.1800 కోట్లతో యాదాద్రిని కడుతున్నామన్నారు. చేతి వృత్తుల వాళ్లకు ఉపాది కల్పించడమే శిల్పారామం ప్రత్యేకతగా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు