సీరియల్స్‌లో ఛాన్స్‌ ఇస్తానంటూ ఆర్టిస్టులకు ఎర

22 Jun, 2019 19:39 IST|Sakshi

నకిలీ ఫేస్‌బుక్‌తో డబ్బులు వసూలు 

సాక్షి, హైదరాబాద్‌: ఓ ప్రైవేట్‌ టీవీ చానల్‌ ప్రొడ్యూసర్‌ డైరెక్టర్‌ పేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీ సృషించి అవకాశాల ఇస్తామంటూ అందినకాడికి వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ హరనాథ్‌ కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్‌ శ్రీదేవి అలియాస్‌ సుస్మిత బెంగళూరులోని అత్తూరులో నివాసం ఉంటోంది. బుల్లితెర సీరియల్స్‌ను క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే మమకారం పెరిగింది. ఈ క్రమంలోనే 2018 జూలైలో ఓ ప్రైవేట్‌ టీవీ చానెల్స్‌లో సీరియల్స్‌ ప్రారంభ, ముగింపు సమయంలో ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌గా శ్రీదేవి తుమ్మల అని వచ్చింది. 

దీంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీతో పేజీ తెరిచింది. టీవీ, మూవీ ఆర్టిస్ట్‌లు అవాలనుకునేవారితో ఈ ఫేస్‌బుక్‌ ఐడీ ద్వారా సంప్రదించేది. వారికి సీరియల్స్‌లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని విలాస జీవితానికి అలవాటుపడింది. అలాగే టీవీ ఆర్టిస్టులు నిషామా, శిరీష, కరుణ, ఇతరులకు ఫ్రెండ్‌షిప్‌ రిక్వెస్ట్‌లు పంపి నిజమైన ప్రొడ్యూసర్‌ శ్రీదేవి తుమ్మలగా రోజువారీతో చాట్‌ చేసేది. ఎవరైనా ఫేస్‌బుక్‌ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్‌ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్‌ చేయమని కోరేది. 

ఈ విధంగానే 2018 సెప్టెంబర్‌లో వంశీ అనే వ్యక్తికి టీవీ సీరియల్స్‌లో అవకాశమిస్తానని రూ.50వేలు వసూలు చేసింది. అలాగే మణికొండకు చెందిన క్రాంతికుమార్‌కు ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి ఇతర మహిళ ఫొటోలను పంపి  చాట్‌చేసి సన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆమె పంపిన ఫొటోలకు ఫ్లాట్‌ అయిన క్రాంతికుమార్‌ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న శ్రీలత పలుమార్లు తన బ్యాంక్‌ ఖాతాల్లో అతడితో రూ.ఆరు లక్షలు డిపాజిట్‌ చేయించుకుంది. అయితే ఈ విషయం ప్రొడ్యూసర్‌ శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో తన పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్‌ డాటాతో నిందితురాలు శ్రీలతను బెంగళూరులో అరెస్టు చేసింది. గతంలోనే ఇటువంటి కేసుల్లోనే శ్రీలతను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు