'సీఎం హామీని రెండు నెలల్లో పూర్తి చేశా'

31 Aug, 2015 19:21 IST|Sakshi

సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా 8 కొత్త మార్కెట్‌లు ఇస్తామని హామీ ఇచ్చారని,  రెండు నెలల్లో 13 వ్యవసాయ మార్కెట్‌లు జిల్లాకు ఇచ్చామని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో సోమవారం రూ. 3 కోట్లతో నిర్మించే గోదాములకు హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికి 25 వ్యవసాయ మార్కెట్‌లు ఉండగా మరో 13 నూతనంగా మంజూరు  చేశామన్నారు. అందులో పెద్దపల్లి నియోజకవర్గంలో జూలపెల్లి, కాల్వశ్రీరాంపూర్ ఉందన్నారు. నియోజకవర్గంలో పదిన్నర కోట్లతో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాముల్లో ధాన్యాన్ని ఆరు నెలల వరకు నిల్వ చేసినా వడ్డీ లేని రూ. 2లక్షల వరకు రుణాలను బ్యాంకు ఇస్తుందన్నారు.

మార్కెట్‌కు వచ్చిన రైతులకు ప్రమాదబీమా సైతం రూ. లక్ష ఇవ్వడం జరగుతుందన్నారు. రైతు బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మత్తు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల పెన్షన్లు గత ప్రభుత్వం అందిస్తే మా ప్రభుత్వం 37లక్షల మందికి పెన్షన్‌లు అందించామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైస్‌మిల్లులు కరెంట్ లేకుండా జనరేటర్‌తో నడిచి నెలకు రూ. 3 లక్షలు నష్టం వాటిల్లుతుందని తమ దృష్టికి తేగా నేడు కరెంట్ కొరత లేని విధంగా అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ 2 ఫేస్‌లో నెల రోజుల్లో టెండర్ పిలుస్తామని చెప్పడంతో పాటు మినీ ట్యాంకుబండ్, సీసీ రోడ్లు, మూత్రశాలలు, రైతులకు విశ్రాంతి గది నిర్మిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు