అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్‌

3 Oct, 2023 03:14 IST|Sakshi
ఐటీ టవర్‌ నమూనాను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్, ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే బలాలా 

బీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ కేసీఆర్‌ చేతిలోనే ఉంది: కేటీఆర్‌ 

హైదరాబాద్‌లో ఐటీ రంగం దూసుకెళ్తోందన్న మంత్రి 

మలక్‌పేటలో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌కు శంకుస్థాపన 

మలక్‌పేట: బీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌ సీఎం కేసీఆర్‌ చేతిలోనే ఉందని, ఎంఐఎం స్టీరింగ్‌ అసదుద్దీన్‌ చేతిలోనే ఉందని.. కానీ బీజేపీ స్టీరింగ్‌ మాత్రం వ్యాపారవేత్త అదానీ చేతిలో ఉందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. ప్రధాని మోదీ చేతుల్లో ఏమీ లేదని, అదానీ చెప్పినట్టే నడుచుకుంటున్నారని ఆరోపించారు. మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఐటెక్‌ న్యూక్లియస్‌ ఐటీ టవర్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేశారు.

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్‌ బలాలాతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. మలక్‌పేటలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐటీ టవర్‌ను నిర్మించనున్నామని, దీనితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇందులో తొలి విడతగా 10.35 ఎకరాల్లో రూ.1,032 కోట్లతో 21 అంతస్తులతో 15లక్షల చదరపు అడుగుల ఐటీ టవర్‌ నిర్మిస్తున్నామన్నారు. ఒకప్పుడు మలక్‌పేట అంటే టీవీ టవర్‌ గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు ఐటీ టవర్‌ ఐకాన్‌ మారుతుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ ఐటీ రంగంలో దూసుకెళ్తోందని, వరుసగా రెండేళ్లపాటు బెంగళూరు కంటే అధికంగా ఐటీ ఉద్యోగాలను కల్పిస్తోందని కేటీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం, హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉన్నాయన్నారు. గణేశ్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపును వాయిదా వేసుకున్నారని.. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన గంగా జమునా తెహజీబ్‌ సంస్కృతికి అద్దం పట్టారని పేర్కొన్నారు. కాగా.. కేసీఆర్‌ విజన్‌ ఉన్న నాయకుడని, ఆయన సారథ్యంలో తెలంగాణ, హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందాయని ఎంపీ అసదుద్దీన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు