హైదరాబాద్‌కు వరప్రదాయిని ఓఆర్‌ఆర్‌ 

2 May, 2018 02:19 IST|Sakshi
కండ్లకోయ జంక్షన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో ఎంపీ మల్లారెడ్డి,  మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మేయర్‌ బొంతు 

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు 

కండ్లకోయ జంక్షన్‌ పూర్తితో రింగ్‌ రోడ్డు నిర్మాణం సంపూర్ణం 

ఓఆర్‌ఆర్‌ వెంట 19 ట్రామాకేర్‌ సెంటర్లు ఏర్పాటు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అభివృద్ధికి ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) వరప్రదాయినిగా మారనుందని పురపాలక మంత్రి కె.తారకరామారావు అన్నారు. రూ.125 కోట్ల వ్యయంతో నిర్మించిన 1.10 కిలోమీటర్ల కండ్లకోయ జంక్షన్‌తో పాటు టోల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఏ జిల్లాకు వెళ్లాలన్నా ఓఆర్‌ఆర్‌ దిక్సూచిగా మారిందని, ఇది నగరానికి గొప్ప ఆస్తి అని అభివర్ణించారు.

ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదాలు జరిగితే సత్వరం అత్యవసర ప్రాథమిక చికిత్స అందించేందుకు 19 ఇంటర్‌ ఛేంజ్‌ల వద్ద ట్రామా కేర్‌ సెంటర్లను త్వరలో అందుబాటులోకి తెచ్చేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. వాహన వేగాన్ని నియంత్రించడంతోపాటు సురక్షిత ప్రయాణం కోసం హైవే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు, ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నామని కేటీఆర్‌ తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ ఒత్తిడిని తగ్గించేందుకు అంతర్గత రహదారులను ఓఆర్‌ఆర్‌కు అనుసంధానించే రేడియల్‌ రోడ్లను పూర్తి చేస్తున్నామన్నారు. 

స్కైవేలకు కేంద్రం అడ్డుపుల్ల 
హెచ్‌ఎండీఏ ద్వారా శామీర్‌పేట నుంచి జూబ్లీ బస్టాండ్, ప్యాట్నీ సెంటర్‌ నుంచి సుచిత్ర సెంటర్‌ వరకు రూ.2,500 కోట్ల అంచనాలతో రెండు స్కైవేల నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డటంతో ఈ పనులు ప్రారంభించలేకపోతున్నామని కేటీఆర్‌ ఆరోపించారు. అర్థంపర్థం లేకుండా అభివృద్ధి ప«థకాలకు కేంద్రం అడ్డుపడుతోందని విమర్శించారు. స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ నుంచి 100 ఎకరాల భూమిని కోరామని, అందుకు ప్రతిగా సమాన విలువైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని కోరడంతో శామీర్‌పేటలో 600 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశామని చెప్పారు. అయితే సంవత్సరానికి ఆస్తి పన్ను రూపంలో రూ.30 కోట్ల ఆదాయాన్ని కోల్పోతామని, ఆ నష్టపరిహారాన్ని ఏటా చెల్లించాలని రక్షణ శాఖ కోరిందని, ఇది అన్యాయమని అన్నారు. మరో మూడు రోజుల్లో రక్షణ శాఖతో జరిగే సమావేశంలో మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి పోట్లాడి భూమి ఇచ్చేలా ఒప్పించాలని కోరారు. భూమి ఇవ్వాలని తాను బహిరంగంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని, దీనికి సంబంధించి త్వరలో ఓ లేఖ కూడా రాస్తానని చెప్పారు. 

హెచ్‌ఎండీఏ ద్వారా అభివృద్ధి పనులు 
జంటనగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో హెచ్‌ఎండీఏ కృషిని కేటీఆర్‌ కొనియాడారు. ప్రస్తుతం రూ.1,750 కోట్ల అభివృద్ధి పనులను హెచ్‌ఎండీఏ నిర్వహిస్తోందని చెప్పారు. అభివృద్ధి పనుల్లో కీలకంగా వ్యవహరిస్తూ, ఆర్థికంగానూ మెరుగుపడిందని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులు కృషిని కేటీఆర్‌ అభినందించారు. కాగా, ప్రపంచంలోని ఏ నగరానికి లేని విధంగా హైదరాబాద్‌కు ఉన్న 158 కి.మీ. ఓఆర్‌ఆర్‌ను గిన్నిస్‌ రికార్డులోకి ఎక్కించేందుకు లేఖ రాస్తున్నామని చిరంజీవులు తెలిపారు. ఈ సందర్భంగా ఓఆర్‌ఆర్‌ పనులు పూర్తి చేయడంలో నిబద్ధతతో పనిచేసిన అధికారులు సీజీఎం ఇమామ్, జీఎం రవీందర్, డీజీఎం నవీన్, ఈవో గంగాధర్‌ తదితరులను మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సరదాగా కారు నడిపిన కేటీఆర్‌ 
కండ్లకోయ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చెసిన మంత్రి కేటీఆర్‌ సరదాగా ఎంపీ మల్లారెడ్డి కారును నడిపారు. సుతారిగూడ టోల్‌ ప్లాజా నుంచి కండ్లకోయ జంక్షన్‌కు వస్తుండగా ఎంపీ మల్లారెడ్డి కారు డ్రైవింగ్‌ సీట్‌లో కేటీఆర్‌ కూర్చుని రింగ్‌ రోడ్డుపై కారు నడిపారు. యువత రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పే హోదాలో ఉన్న మంత్రి కేటీఆర్‌ కనీసం సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకుండా కారు నడపడం విమర్శలకు తావిచ్చింది. 
 

>
మరిన్ని వార్తలు