గజ్వేల్‌..‘పట్టణ ప్రగతి’కి మోడల్‌

19 Feb, 2020 03:18 IST|Sakshi
మంగళవారం గజ్వేల్‌ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేస్తున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్‌ల బృందం పర్యటన

బృందానికి దిశానిర్దేశం చేసిన మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌ : ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో మెరుగైన పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నం ప్రశంసనీయం.. ఇక్కడ నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్, వైకుంఠధామం, అర్బన్‌ పార్కులాంటి నిర్మాణాలు తలమాణికంగా నిలుస్తున్నాయి’అని పలువురు మంత్రులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మ న్లు, కమిషనర్ల బృందం కొనియాడింది. ‘పట్టణ ప్రగతి’పై హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎం కేసీఆర్‌తో సమీక్షలో పాల్గొన్న వీరంతా అక్కడి నుంచి బస్సుల్లో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సి పాలిటీని సందర్శించారు. హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ తదితరులతో పాటు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్‌ కమిషనర్లు ఇక్కడ పర్యటించారు.

ముందుగా మున్సిపాలిటీకి సరిహద్దులో ఉన్న వర్గల్‌ మండలం సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని ఈ బృందం సందర్శించింది. అటవీశాఖ పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌ వీరికి అటవీ అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అంశాలవారీగా వివరించారు. ఆ తర్వాత బృందం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం విక్రయాలను, మార్కెట్లోని ఇతర దుకాణ సముదాయాలను పరిశీలించి ముగ్ధులయ్యారు. మంత్రులు సబిత, సత్యవతితో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పలువురు మహిళా మున్సిపల్‌ చైర్మన్లు కూరగాయల వ్యాపారులతో ముచ్చటించారు. ఇది పూర్తయ్యాక వారంతా తిరిగి బస్సుల్లో పట్టణంలోని వైకుంఠధామంను సంద ర్శించి పరిసరాలను ఆసక్తిగా పరిశీలన జరిపారు. తర్వాత అర్బన్‌ పార్కును సందర్శించారు. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓపెన్‌జిమ్‌లో కొద్దిసేపు గడిపారు. జిమ్‌ చేస్తూ తోటి మంత్రులు, ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచారు. అర్బన్‌ పార్కు నిర్మాణం జరిగిన విధానం తమను ఆకట్టుకుందని.. ఇలాంటి నిర్మాణాలు తమ జిల్లాల్లో కూడా జరిగేలా చొరవ చూపుతామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పార్కును ప్రత్యేకంగా కలియతిరిగి తమ జిల్లాలో ఎక్కడెక్కడ ఇలాంటివి నిర్మించుకోవాలనే అంశంపై చర్చించుకున్నారు. 


మంత్రులకు స్వాగతం పలుకుతున్న హరీశ్‌రావు

మెరుగైన వసతులే సీఎం లక్ష్యం: హరీశ్‌రావు 
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మెరుగైన వసతులే లక్ష్యంగా కేసీఆర్‌ పనిచేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధిని మోడల్‌గా చూపుతూ ఇదే తరహాలో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం సూచించారని తెలిపారు. మెరుగైన నగర, పట్టణ జీవన వ్యవస్థను తీసుకురావడానికి ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణంతో పాటు పట్టణాలకు ఆనుకొని ఉండే విధంగా అర్బన్‌ పార్కులను నిర్మించి స్వచ్ఛమైన గాలి అందించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు