చిన్నారుల వేదన వర్ణనాతీతం

31 Jul, 2015 00:35 IST|Sakshi
చిన్నారుల వేదన వర్ణనాతీతం

- చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే డీకే అరుణ
- సవతితల్లిపై కఠినచర్యలు తీసుకోవాలి
గద్వాల:
సవతి తల్లి చిత్రహింసలకు గురై చికిత్స పొందుతున్న జయలక్ష్మి (5), వీరేష్ (10)లను ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి జయలక్ష్మి చెంప, నడుంపై కాలిన గాయాలను చూసి ఎమ్మెల్యే డీకే అరుణ చలించిపోయారు. వీరేష్ చేతిపై ఉన్న కాలిన గాయాన్ని పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆమె వైద్యులకు సూచించారు. చికిత్స పొందుతున్న వీరేష్, జయలక్ష్మితో కొంతసేపు మాట్లాడారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత చిన్నారులను వసతిగృహాల్లో చేర్పించి, విద్యాబుద్దులు నేర్పేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. చిన్నారులపై పాశవికంగా వ్యవహరించిన సవతి తల్లిపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారులకు ప్రాథమిక హక్కులకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జయలక్ష్మి, వీరేష్‌లకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించి, ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆమెతోపాటు చైర్‌పర్సన్ బండల పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

చర్చాంశనీయం.. గట్టు ప్రత్యూష ఉదంతం..
- కోలుకుంటున్న చిన్నారులు..
- సవతి తల్లి, తండ్రిపై కేసు నమోదు..
గట్టు:
సవతి తల్లి పెట్టిన చిత్రహింసల వ్యవహారం పత్రికల ద్వారా బయటి ప్రపంచానికి తెలియడంతో గట్టులో చర్చాంశనీయంగా మారింది. కాగా గట్టు పోలీసులు, వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్ల సహకారంతో జయలక్ష్మి, వీరేష్ గద్వాల ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. సవతి తల్లి, తండ్రి ఏమీ పట్టనట్లుగా గురువారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు.
 
కేసు నమోదు..
సవితి తల్లి చిత్రహింసల నేపథ్యంలో తండ్రి చిన్న మల్లేష్, సవతి తల్లి సుజాతపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు. జయలక్ష్మి కోలుకున్న తర్వాత హైదరాబాదులోని శిశువిహార్‌కు అన్నా చెల్లెళ్లను తరలించనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు