చెత్త తీయడం చాలా కష్టమైన పని.. కానీ ఇదే మాకు అన్నం పెడుతుంది: జయలక్ష్మీ

9 Sep, 2023 10:09 IST|Sakshi

మూసారాంబాగ్‌ సమీపంలోని సలీం నగర్‌లో తెల్లవారుజామున ‘చెత్తబండొచ్చిందమ్మా’ అని అరుస్తూ కనిపిస్తుంది జయలక్ష్మి. డిగ్రీ చదువుతూ తల్లి నడిపే చెత్తబండిలో  సాయం చేస్తుంది జయలక్ష్మి. ‘ఎదగాలనుకుంటే చెత్త నుంచి కూడా  ఎదగొచ్చు’ అంటుందా అమ్మాయి. తాను నివాసం ఉండే మురికివాడ పిల్లల కోసం ట్యూషన్లు చెబుతూ, వాలంటీర్‌గా పని చేస్తూ,ప్రతిష్ఠాత్మక ‘గాంధీ – కింగ్‌ స్కాలర్లీ ఎక్స్చేంజ్‌ ఇనిషియేటివ్‌’లో భాగంగా జూన్‌లో అమెరికా వెళ్లి వచ్చింది జయలక్ష్మి. చిన్న చితకా సవాళ్లకే డీలా పడుతున్న యూత్‌కు జయలక్ష్మి ఇచ్చే స్ఫూర్తి చాలానే ఉంది.

యునైటెడ్‌ స్టేట్స్‌– ఇండియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ (యు.ఎస్‌.ఐ.ఇ.ఎఫ్‌) వారి ‘గాంధీ– కింగ్‌ ఎక్స్చేంజ్‌ ఇనిషియేటివ్‌’ స్కాలర్‌షిప్‌ పొంది, అమెరికా వెళ్లి రెండు వారాల పాటు మార్టిన్‌ లూధర్‌ కింగ్‌ మార్గంలో అహింసా పద్ధతితో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయం చేసి రావడానికి దరఖాస్తులు కోరినప్పుడు మన దేశవ్యాప్తంగా 4 వేల అప్లికేషన్లు వచ్చాయి. వారిలో కేవలం 10 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు.

ఆ పది మందిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు అరిపిన జయలక్ష్మి. హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ సమీపంలో అతి పెద్ద మురికివాడ– సింగరేణి కాలనీలో ఉంటూ, చెత్త బండి లాగుతూ చదువుకుంటున్న ఈ అమ్మాయి ఇలా అమెరికా వరకూ చేరుకోవడం సామాన్యం కాదు. పోరాడే తత్వం, సాధించాలనే పట్టుదల ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.  జయలక్ష్మిలోని అసాధారణమైన చొరవ, తపన ఆమెను ఇలా ముందుకు నడుపుతున్నాయి.


ముగ్గుపిండి అమ్మే దళిత కుటుంబం
అరిపిన జయలక్ష్మిది రాయలసీమ ప్రాంతానికి చెందిన దళిత కుటుంబం. తండ్రి రామ్మోహన్, తల్లి హుసేనమ్మ చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని హైదరాబాద్‌ వలస వచ్చారు. వీరి ఇళ్లల్లో ముగ్గుపిండి అమ్ముకుని తరాలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే జయలక్ష్మి తల్లిదండ్రులు చెత్తబండి నడపడాన్ని ఉపాధి చేసుకున్నారు. ‘అమ్మ ఒక బండి, నాన్న ఒక బండి నడుపుతారు. కాలనీ వాళ్లు నెలకు ఇంతని ఇచ్చే డబ్బులే మాకు జీవనాధారం. గవర్నమెంట్‌ నుంచి ఏమీ జీతం రాదు. చెత్త తీయడం చాలా కష్టమైన పని.

నాన్న తానొక్కడే చెత్త తీయగలిగినా అమ్మకు కష్టమని నేను ఏడో క్లాస్‌ నుంచి ఇవాళ్టి వరకూ ఆమెకు తోడు వెళుతూనే ఉన్నాను. చెత్త సేకరించడం, తడిచెత్త పొడిచెత్త వేరు చేయడం, డంపింగ్‌ యార్డ్‌లో పడేయడం అన్నీ చేస్తాను. ఇది చాలా దారుణమైన పని అని కొందరు అంటారు. కాని నా మటుకు నాకు ఇది అన్నం పెట్టే వృత్తి. నేను దానిని గౌరవిస్తాను. మా ఇంట్లో నేను కాకుండా అన్నయ్య, చెల్లెలు ఉన్నారు. అందరూ మంచిగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడాలని మా అమ్మ తపన. అంతవరకు ఈ పని చేయకతప్పదు’ అంటుంది జయలక్ష్మి.

ఎన్‌.జి.ఓ దృష్టిలో పడి
జయలక్ష్మి చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది. కాలనీలోని సమస్యలపై మాట్లాడేది. స్కూల్లో ఒకసారి ఇలాగే మాట్లాడితే ‘మాంట్‌ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌’ అనే ఎన్‌.జి.ఓ దృష్టిలో పడింది. పేదవర్గాల కోసం పని చేసే ఆ సంస్థ జయలక్ష్మిని తన కార్యకలాపాల్లో భాగం చేస్తూ ప్రోత్సహించింది. ‘స్లమ్స్‌లో ఉండే పిల్లల వికాసం కోసం నేను పని చేశాను. హైదరాబాద్‌లో 56 స్లమ్స్‌ ఉంటే వాటిలో 21 చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు లేవు. మేమందరం మహిళా సంక్షేమ శాఖ దగ్గరకు వెళ్లి మాట్లాడి వాటిని సాధించాం’ అంటుంది జయలక్ష్మి.

ఇంగ్లిష్‌ మీడియంలో చదవాలనుకుని తన వాడ నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్న జయలక్ష్మి తన వాడలోని పిల్లలకు సాయంత్రాలు ట్యూషన్‌ చెప్తూ వారి చదువుకు మేలు చేస్తోంది. ‘కోవిడ్‌ సమయంలో మా కాలనీలో నేను కార్యకర్తగా పని చేశాను. కోవిడ్‌ రాకుండా చాలా వరకు సక్సెస్‌ అయ్యాను’ అంది. 

ఐ.ఏ.ఎస్‌ కావాలని
‘యువతకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. హక్కుల కోసం పోరాడాలి. అమెరికాలో శాంతియుత పోరాటాల విజయగాథలను అధ్యయనం చేయగలగడం నా అదృష్టం. ఒక యువ ప్రతినిధిగా పోరాడుతూనే ప్రజల సేవ కోసం ఐ.ఏ.ఎస్‌ సాధించాలనుకుంటున్నాను. అందుకు కావలసిన సహాయం పొందగలననే అనుకుంటున్నాను. నాకు ఎంతమంచి పేరున్నా చెత్త అమ్మాయి అనే పిలుస్తారు కొందరు. వారి చేత ఉత్తమ అమ్మాయి అనిపించుకునేందుకు, లక్ష్యం లేని వారి బుర్రలే చెత్త అని నిరూపించేందుకు మరింత కష్టపడతాను’ అంది జయలక్ష్మి.
– సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు