ఎంపీగా కవితను గెలిపించండి

3 Apr, 2019 15:44 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరుతున్న సర్పంచ్‌ పద్మనర్సింహరావు, టీఆర్‌ఎస్‌ కండువాలు కప్పుకుంటున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు 

ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌

సాక్షి, కురవి:  మహబూబాబాద్‌ ఎంపీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచిన కవితను ప్రజలు ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించాలని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. రెండోరోజు మంగళవారం మండలంలోని నేరడ, తట్టుపల్లి, కురవి, మొగిలిచర్ల, కంచర్లగూడెం, బలపాల, రాజోలు, గుండ్రాతిమడుగు(స్టేషన్‌), కొత్తూరు(జీ) గ్రామాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరడ గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన వంద మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కురవిలో ఏకైక టీడీపీ సర్పంచ్‌ నూతక్కి పద్మనర్సింహరావుతో పాటు వార్డు సభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

మొగిలిచర్లలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ముగ్గురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ గ్రామంలో ఏ ఒక్క పార్టీ లేకుండా పోయింది. మొగిలిచర్ల గులాబీమయమైంది. కంచర్లగూడెంలో సైతం ఇదే మాదిరిగా కాంగ్రెస్‌లో ఉన్న వారంతా టీఆర్‌ఎస్‌లో చేరారు. బలపాల గ్రామంలో వార్డు సభ్యులు పార్టీలో చేరారు. మొత్తం మీద మండలంలో 90శాతం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.  

ఈ సందర్భంగా రెడ్యానాయక్‌ మాట్లాడుతూ డోర్నకల్‌ ఆడబిడ్డ, మానుకోట రాజకీయ నాయకురాలు, ఇల్లందు కోడలు మాలోత్‌ కవితను అధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.  మొదటి సారిగా మానుకోట నుంచి పార్లమెంట్‌కు వెళ్లే అవకాశం  మహిళకు వచ్చిందన్నారు.  ప్రతీ గ్రామం నుంచి ఐదు వందల మెజారిటీ సాధించాల్సిన అవసరం ఉందన్నారు. కురవి మండలం నుంచి 20వేల మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయన్నారు. కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.  

ఈ సమావేశంలో ఎంపీపీ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు కొణతం కవిత, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ నూకల వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కృష్ణారెడ్డి, మండల పరిశీలకుడు కేశబోయిన కోటిలింగం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు తోటలాలయ్య, మండల రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్‌ ముండ్ల రమేష్, టీఆర్‌ఎస్‌ నాయకులు డీఎస్‌ రవిచంద్ర, బండి వెంకటరెడ్డి, గోవర్థన్‌రెడ్డి, గుగులోత్‌ రవినాయక్, బాదావత్‌ రామునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు