చూడండి సారూ.. మా గోస  

24 Jul, 2018 08:50 IST|Sakshi
సమస్యలు పరిష్కరించాలని ఏఎస్‌డబ్ల్యూతో వాదనకు దిగిన విద్యార్థినులు 

‘హాస్టల్‌లో భయం భయంగా’ కథనానికి స్పందన

హాస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు

శిథిల భవనాన్ని  తొలగించి నూతన భవనం నిర్మించాలని డిమాండ్‌

షాద్‌నగర్‌రూరల్‌: పట్టణంలోని ఎస్సీ హాస్టల్‌ భవనం శిథిలావస్థకు చేరుకొని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘హాస్టల్‌లో భయం భయంగా’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో సోమవారం ప్రచురించిన కథనానికి ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి సుధాకర్‌రెడ్డి, చేవేళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషితలు ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఎమ్మెల్యేకు సమస్యల ఏకరువు 

ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సోమవారం ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి పెచ్చులూడుతున్న భవనాన్ని పరిశీలించారు. భోజనశాలను తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికే విద్యార్థులు హాస్టల్‌ ఎదుట భైఠాయించారు. విద్యార్థులంతా ఒక్కసారిగా తమ సమస్యలను ఎమ్మెల్యేతో ఏకరువు పెట్టారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే తామందరం ఇక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని, మాకు టీసీలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

దీనికి స్పందించిన ఎమ్మెల్యే హాస్టల్‌ విద్యార్థులు ఉండేందుకు భవనాన్ని అద్దెకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని చేవెళ్ల ఏఎస్‌డబ్ల్యూ నుషిత, ఇన్‌చార్జి వార్డెన్‌ సుశీలను ఆదేశించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి గృహంలో ఈ విధంగా సమస్యలు ఉంటే విద్యార్థినులు ఏవిధంగా చదువుకుంటారని వారిని ప్రశ్నించారు. హాస్టల్‌లో పనిచేసేందుకు కావల్సిన సిబ్బందిని వెంటనే నియమించే విధంగా చర్యలు చేపట్టాలని ఏఎస్‌డబ్ల్యూను ఆదేశించారు. 

వాహనం ఎదుట భైఠాయింపు 

స్ధానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ఎస్సీ హాస్టల్‌లో సమస్యలు నెలకొన్నాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిల్కమర్రి నర్సింలు అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని, విద్యారంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. హాస్టల్‌ నూతన భవన నిర్మాణం, సమస్యల పరిష్కారం గురించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థినులతో కలిసి వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు.

దీంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, వాహనం ఎదుట భైఠాయించారు. సమస్య పరిష్కారానికి మార్గం చూపే వరకు వెళ్లనీయమని విద్యార్థులు భీష్మించుకొని కూర్చోవడంతో ఆయన వినతిపత్రం స్వీకరించారు. అనంతరం విద్యార్థినులు హాస్టల్‌ నుంచి తహసీల్దార్‌  కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట భైఠాయించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశాంత్, మనోహర్, పవన్, సాయి, సుమన్, పవన్, జాంగారి రవి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు