నిమజ్జనానికి ఎంఎంటీఎస్‌ స్పెషల్‌ ట్రైన్స్‌

10 Sep, 2019 12:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 13న తెల్లవారు జామున 4 గంటల వరకు  8 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి 30 నిమిషాల నుంచి 45 నిమిషాలకు ఒకటి చొప్పున ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సర్వీసులు నడుస్తాయి. లింగంపల్లి–ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌–ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌–నాంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, నాంపల్లి–లింగంపల్లి మధ్య ఈ అదనపు రైళ్లు నడుస్తాయి.  

ఎంఎంటీఎస్‌... ‘హైలైట్స్‌’ యాప్‌
నగరంలో రైళ్ల రాకపోకల సమాచారం కోసం ‘హైలైట్స్‌’ మొబైల్‌ యాప్‌ ఎంతో దోహదం చేస్తుంది. ప్రయాణికులు ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అలాగే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగించే  ప్రధాన రైళ్ల వేళలు ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు లభిస్తాయి. జంటనగరాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నాంపల్లి– లింగంపల్లి, ఫలక్‌నుమా–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి.

ప్రతి రోజు 1.5 లక్షల మంది ప్రయాణికులు ఎంఎంటీఎస్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. పలువురు ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు ఎంఎంటీఎస్‌పైనే ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఇలాంటి ప్రయాణికులకు ‘హైలైట్స్‌’ యాప్‌ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు వివిధ రూట్లలో నడిచే రైళ్లను ప్రత్యక్షంగా ఈ యాప్‌ ద్వారా తెలుసుకొనేందుకు అవకాశం లభిస్తుంది. ఏ ట్రైన్‌ ఏ రూట్లో ఎక్కడి వరకు వచ్చిందనేది ఈ యాప్‌ ద్వారా తేలిగ్గా తెలుసుకోవచ్చు. మూడేళ్ల క్రితం అందుబాటులోకి తెచ్చిన ఈయాప్‌ను ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. (ఆటంకాలు లేకుండా ఖైరతాబాద్‌ గణపతి దర్శనం ఎలా?.. ఇక్కడ క్లిక్‌ చేయండి)  

>
మరిన్ని వార్తలు