లైన్లు రెడీ...రైళ్లేవీ?

31 Mar, 2018 08:22 IST|Sakshi
బొల్లారం – సికింద్రాబాద్‌ లైన్‌ను తనిఖీ చేస్తున్న అధికారులు (ఫైల్‌)

ఎంఎంటీఎస్‌ రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి

బొల్లారం–సికింద్రాబాద్, ఘట్‌కేసర్‌–సికింద్రాబాద్, తెల్లాపూర్‌–పటాన్‌చెరు లైన్లు సిద్ధం

భద్రతా కమిషన్‌ తనిఖీలు పూర్తయినా పట్టాలెక్కని రైళ్లు

గత బడ్జెట్‌లో కేటాయించినరూ.430 కోట్లు విడుదలలో జాప్యం

రైల్వే టర్మినళ్ల నిర్మాణంపైన కదలిక శూన్యం

ఎంఎంటీఎస్‌ రెండో దశను నిధుల గండం వెంటాడుతోంది. లైన్లు సిద్ధమైనప్పటికీ కొత్త రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. సికింద్రాబాద్‌ నుంచి బొల్లారం మార్గంలో కొద్ది రోజుల క్రితమే రైల్వే భద్రతా కమిషన్‌ తనిఖీలు నిర్వహించింది. రైళ్లు నడిపేందుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్లు అనుమతులు కూడా ఇచ్చేసింది. కానీ కొత్త లైన్లలో ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపేందుకు బోగీలు మాత్రం లేవు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండాఉండిపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వం గత బడ్జెట్‌లో తమ వంతు వాటాగా రూ.430 కోట్లు కేటాయించినా..ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో రెండో దశ రూట్లలో రైళ్లు పట్టాలెక్కడం లేదని తెలుస్తోంది.

సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్‌ రెండో దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంది. దీంతో రైల్వే లైన్ల పనులు పూర్తయినప్పటకీ రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో వందల కోట్లు వెచ్చించి నిర్మించిన లైన్లు వినియోగంలోకి రాకుండా ఉండిపోతున్నాయి. ఒక్క 12.5 కిలోమీటర్ల పొడవైన సికింద్రాబాద్‌–బొల్లారం లైన్లు మాత్రమే కాకుండా 14 కిలోమీటర్ల పొడవైన మౌలాలి–ఘట్‌కేసర్, మరో 10 కిలోమీటర్ల పొడవైన పటాన్‌చెరు–తెల్లాపూర్‌ లైన్లు కూడా త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ మిగతా మార్గాల్లో పనులు పూర్తి చేయడంతో పాటు, కొత్త రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల కొరత కారణంగా రైళ్ల కొనుగోళ్లు, స్టేషన్ల నిర్మాణం, మరికొన్ని లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ వంటి పనుల్లో జాప్యంనెలకొంది.

రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి...
నగర శివార్లను కలుపుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశకు మొదటి నుంచి నిధులు కేటాయించడంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సకాలంలో నిధులు అందజేయకపోవడం వల్ల  పనులు నత్తనడక నడుస్తున్నాయి. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ సంయుక్త ప్రాజెక్టు  వ్యయంలో రాష్ట్రం తన మూడు వంతుల నిధులను అందజేయాల్సి ఉంది. మరో  1/4 వంతు నిధులను రైల్వేశాఖ కేటాయిస్తుంది. సుమారు రూ.630 కోట్లకు పైగా రాష్ట్రప్రభుత్వం నుంచి అందాల్సి ఉండగా  ఇప్పటి వరకు దశల వారీగా రూ.200 కోట్ల వరకే అందజేశారు. వీటితో పాటు, రైల్వేశాఖ నిధులతో కొన్ని లైన్‌ల విద్యుదీకరణ, డబ్లింగ్‌ వంటి పనులు పూర్తయ్యాయి. మిగతా పనుల్లో నిధుల కొరత తలెత్తింది. సకాలంలో ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు రాకపోవడం వల్ల  పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రం నుంచి రైల్వేకు అందాల్సిన నిధులను రాబట్టుకోవడమే  ప్రధాన లక్ష్యంగా దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ రెండు రోజుల క్రితం రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్‌ జోషిని కలిశారు. ఎంఎంటీఎస్‌ రెండో దశకు ఇవ్వాల్సిన  సుమారు రూ.430 కోట్ల నిధులను అందజేయాల్సిందిగా కోరారు. అలాగే చర్లపల్లి టర్మినల్‌ కోసం భూమిని కేటాయించాలని, అప్రోచ్‌ రోడ్డు వేయించాలని కోరారు. 

నిధులొస్తేనే రైళ్లు....
ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్న సికింద్రాబాద్‌–బొల్లారం మార్గంలో ప్రతి రోజు కనీసం 20 ట్రిప్పులు నడపాలన్నా ఒక ట్రిప్పుకు 3 బోగీల చొప్పున 15 అవసరమవుతాయి. అలాగే  సికింద్రాబాద్‌ –ఘట్కేసర్, పటాన్‌చెరు–తెల్లాపూర్‌ మార్గంలో ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మార్గాల్లోనూ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడపాలంటే కొత్తబోగీలు అవసరమే. మొత్తంగా ఎంఎంటీఎస్‌ రెండో దశ మార్గాల్లో  రైళ్లు నడిపేందుకు ఇంజన్‌లు, బోగీల కోసం కనీసం రూ.200 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధులు అందజేస్తే తప్ప కొత్త బోగీలు కొనే పరిస్థితి లేదని, రైల్వేశాఖ తన వంతు నిధులను ఇప్పటికే పూర్తిగా ఖర్చు చేసిందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో  రైల్వే ఉన్నతాధికారులు జరిపిన సంప్రదింపుల్లో ఎంఎంటీఎస్‌ రెండో దశతో పాటు చర్లపల్లి టర్మినల్‌పై చర్చించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని  సుమారు రూ.80 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ విస్తరణకు  ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ  ఇక్కడ భూమి కొరత ఉంది. ఈ అంశంపైన అధికారులు చర్చలు జరిపారు.

మరో టర్మినల్‌ కోసం సర్వే...
చర్లపల్లితో పాటు  రెండో టర్మినల్‌గా గతంలో వట్టినాగులపల్లిని ప్రతిపాదించారు. కానీ  నగరానికి చాలా దూరంలో  ఉన్న వట్టినాగులపల్లి కంటే  సమీపంలో ఉండి ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఉండే మరో చోట రైల్వే టర్మినల్‌ కట్టించాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. నాగులపల్లి నుంచి నగరానికి  రావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసి ఉంటుంది. అలాగే రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పైగా  రోడ్డు రవాణా మార్గాలను విస్తృతంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మరోవైపు ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో  దివంగత ముఖ్యమంత్రి  డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతిపాదించిన హైటెక్‌సిటీ వద్ద కానీ లేదా భూమి లభ్యతను బట్టి మరో చోట కానీ టర్మినల్‌ నిర్మిస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ  మేరకు  సంయుక్త సర్వే చేపట్టాలని దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

మరిన్ని వార్తలు