నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు | Sakshi
Sakshi News home page

అనుక్షణం..అప్రమత్తం

Published Sat, Mar 31 2018 8:26 AM

Today Traffic Instructions For Hanuman Jayanthi - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హనుమాన్‌ జయంతి నేపథ్య ంలో శనివారం జరుగనున్న భారీ ఊరేగింపునకు నగర పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు విభాగంలో ఉన్న సిబ్బందితో పాటు సాయుధ బలగాలనూ బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 14 వేల మందిని బందోబస్తుకు కేటాయించారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ గురు–శుక్రవారాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేయడంతో పాటు బందో బస్తు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాన ఊరేగింపు జరిగే మార్గాలతో పాటు ప్రారంభం, ముగింపు జరిగే దేవాలయాలను కమిషనర్‌ సం దర్శించారు. గౌలిగూడ రామ్‌మందిర్‌ వద్ద ప్రారంభమయ్యే  ప్రధాన ఊరేగింపు నగరంలో ని మూడు జోన్ల పరిధిలో 27 కిమీ మేర సాగుతూ తాడ్‌బండ్‌ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద  ముగుస్తుంది.

మరోపక్క తూర్పు మండలంలోని ఐఎస్‌ సదన్‌ నుంచి మరో ఊరేగింపు మూడు కిలోమీటర్లు సాగి గౌలిగూడ రామ్‌ మందిర్‌ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. మొత్తమ్మీద 15 ప్రాంతాల నుంచి వచ్చే ఊరేగింపులు ప్రధాన ఊరేగింపులో కలవనున్నాయి. సైబరాబాద్‌తో పాటు నగరంలోని తూర్పు, మధ్య, ఉత్తర మండలాల్లో మొత్తం 27 కిమీ మేర జరిగే ఊరేగింపును కమ్యూనిటీ, ట్రాఫిక్‌ సీసీ కెమెరాల ద్వారా బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) నుంచి పర్యవేక్షించనున్నారు. అదనంగా 570 తాత్కాలిక, మూవింగ్, వెహికిల్‌ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉండే పోలీసులకు మరో 300 హ్యాండీ క్యామ్స్‌ అందిస్తున్నారు. ఆద్యంతం ప్రతి ఘట్టాన్నీ చిత్రీకించేలా ఏర్పాట్లు చేశారు.  ఊరేగింపు జరిగే మార్గాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించిన పోలీసులు... శుక్రవారం రాత్రి నుంచే బారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు. బందోబస్తునూ రెండు రకాలు గా విభజించారు. శోభాయాత్ర వెంట ఉండేందు కు కొందరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యవేక్షించడానికి మరికొంత మందిని కేటాయిస్తున్నా రు. ప్రతి జోన్‌ను ఆయా డీసీపీలు బాధ్యత వహిస్తారు. వీరికితోడు ప్రాంతాల వారీగా సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఊరేగింపు ముందు, ముగింపులో అదనపు, సంయుక్త పోలీసు కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఊరేగింపులో దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. 

అసాంఘిక శక్తులపై డేగకన్ను...
ఊరేగింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కొత్వాల్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శాంతిభద్రత విభాగంలో పాటు టాస్క్‌ఫోర్స్‌ అధికారులూ అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు మైత్రీ, పీస్‌ కమిటీలతో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో పని చేస్తున్నారు. మరోపక్క టాస్క్‌ఫోర్స్, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసుల రౌడీషీటర్లతో పాటు అనుమానిత వ్యక్తులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి కొందరిని బైండోవర్‌ సైతం చేస్తున్నారు. ఊరేగింపు బందోబస్తు విధుల్లో ఉండే ప్రతి పోలీసు తమ చుట్టూ ఉన్న  25 మీటర్ల మేర కన్నేసి ఉంచుతారు. అక్కడ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ... స్మార్ట్‌ ఫోన్‌లలో ఉన్న ‘హైదరాబాద్‌ కాప్‌’ యాప్‌ ద్వారా వీడియోలు తీస్తూ అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఎవరికైనా అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే వారి ఫోటోలతో పాటు వివరాలనూ పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు...   
హనుమజ్జయంతి నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గౌలిగూడ రా>మ్‌మందిర్‌ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి చౌరస్తా, ఆంధ్రాబ్యాంక్‌ చౌరస్తా, డీఎం అండ్‌ హెచ్‌ఎస్‌ సర్కిల్, రామ్‌ కోఠి చౌరస్తా, కాచిగూడ జంక్షన్, వైఎంసీఏ నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్, కవాడీగూడ, బైబిల్‌ హౌస్, ఎంజీ రోడ్, బాలమ్‌రాయ్‌ మీదుగా తాడ్‌బన్‌ హనుమాన్‌ టెంపుల్‌ వరకు సాగనున్న ఈ మార్గంలో ఆంక్షలు విధించారు. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్థితిగతుల నేపథ్యంలో వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కమిషనర్‌ సూచించారు. మరోపక్క ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ నుంచి ముషీరాబాద్‌ చౌరస్తా వైపు ఎలాంటి వాహనాలను అనుమతించరు. అవసరమైన పక్షంలో ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లిస్తారు.

బందోబస్తు విధుల్లో ఐదుగురు అదనపు సీపీలు, ఒక సంయుక్త సీపీ, 13 మంది డీసీపీలు, 19 మంది అదనపు డీసీపీలు, 65 మంది ఏసీపీలు, 235 మంది ఇన్‌స్పెక్టర్లు, 670 మంది సబ్‌–ఇన్‌స్పెక్టర్లతో కలిపి మొత్తం 14 వేల మంది పాల్గొంటారు.
చార్మినార్‌ ప్రాంతానికి అదనపు సీపీ (క్రైమ్‌) షికా గోయల్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. సిద్ది అంబర్‌బజార్‌ మసీదు వద్ద క్యాంపు చేసే అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ మధ్య మండలాన్ని పర్యవేక్షించనున్నారు. అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్‌ చౌహాన్‌ పోలీసు కమిషనర్‌కు సహకరిస్తూ నగర వ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారు. ఊరేగింపు ప్రారంభంలో అదనపు సీపీ (సీఏఆర్‌) ఎం.శివప్రసాద్, ముగింపులో అదనపు సీపీ (పరిపాలన) టి.మురళీకృష్ణ ఉండనున్నారు.  
టాస్క్‌ఫోర్స్‌ టీమ్స్‌ ఊరేగింపు ఆద్యంతం బందోబస్తు నిర్వహించనున్నాయి. సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి సుల్తాన్‌బజార్‌ డివిజన్‌కు నేతృత్వం వహించనున్నారు.  
పోకిరీలకు చెక్‌ చెప్పడానికి షీ–టీమ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 వరకు నగరంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు.  
కమ్యూనికేషన్‌ పరికరాలు, బైనాక్యులర్లతో ఎల్తైన భవనాలపై రూఫ్‌ టాప్‌ వాచ్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement
Advertisement