మొయినాబాద్‌ ఎంపీఓపై వేటు

24 Nov, 2019 11:16 IST|Sakshi

గతంలో పనిచేసిన చోట ఉషాకిరణ్‌ రూ.7.72 లక్షల దుర్వినియోగం 

సస్పెండ్‌కు కారణం ఇదేనా? మరోటా.. అని చర్చ 

సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్‌ మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఉషాకిరణ్‌పై వేటు పడింది. ఆమె గతంలో పనిచేసిన చోట నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని తేలడంతో సస్పెండ్‌ చేస్తూ ఇంచార్జి కలెక్టర్‌ హరీష్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్‌ మండల పంచాయతీ అధికారిగా పదోన్నతి పొందడానికి ముందు ఉషాకిరణ్‌.. ఇబ్రహీంపట్నం మండలం పోచారం పంచాయతీ సెక్రటరీగా 2018–19లో విధులు నిర్వర్తించారు. ఈ సమయంలో పంచాయతీ పరిధిలో పన్నుల రూపంలో వసూలైన రూ.7.72 లక్షలను ప్రభుత్వ ఖజానాలో జమచేయకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు విచారణలో తేలింది. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన ఇంచార్జి కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేశారు.  

అసలు కారణం ఇదేనా..? 
మొయినాబాద్‌లో మండల పంచాయతీ అధికారిగా తన బాధ్యతలను విస్మరించి అనధికార వెంచర్ల యాజమానులకు సహకరించారనే ఆరోపణలు సైతం ఉషాకిరణ్‌పై వెల్లువెత్తాయి. అనుమతి లేని వెంచర్ల ఏర్పాటుపై చూసీచూడనట్లు వ్యవహరించేందుకు యజమానుల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల  పేర్లను, హోదాను కూడా ఆమె వాడుకున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజులుగా మొయినాబాద్‌ మండల పరిధిలో అనధికార లేఅవుట్లను అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై ఆరోపణలు, అనధికార వెంచర్ల ఏర్పాటులో తన పాత్ర వెలుగులోకి వస్తోంది. ఈ విషయం యంత్రాంగం దృష్టికి వెళ్లడంతో ఆమె తొలుత పనిచేసిన చోటు నుంచి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోచారంలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తేలడంతో ఆ వెంటనే సస్పెండ్‌ చేసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
 

మరిన్ని వార్తలు